వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను స్థాపించానని, ఆ పార్టీకి తాను అధ్యక్షుడినంటూ కడపకు చెందిన మహబూబ్‌బాషా చెప్పారు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదేనంటూ చెప్పుకుంటున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శివకుమార్ అనేవ్యక్తిపై కడప రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. బ్లాక్‌మెయిలింగ్, కోర్టు ధిక్కార నేరం కింద కేసు నమోదుచేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. తనను శివకుమార్ బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదుచేశారు.
శివకుమార్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదన్నారు. తాను గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి ఎంతో సేవచేశానని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ స్థాపించి రిజిస్ట్రేషన్‌కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు బాషా తెలిపారు. ఇందుకోసం తగిన ప్రతిపాదనలు కూడా పంపామన్నారు.