25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఒయు ఐకాస నేతల మధ్య చిచ్చు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థి సంఘాల (ఐకాస) మధ్య చిచ్చు రగిలింది. తెరవెనుక రాజకీయ నేతలు విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరాటానికి బీజం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విద్యార్థులు మాత్రం అనేక వర్గాలుగా విడిపోయి పరస్పర నిందారోపణలతో, దాడులకు సర్వసన్నద్దమవుతున్న తీరు తెలంగాణ వాదులను కలవర పరుస్తోంది. ఈ ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలవాల్సిన విద్యార్థులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారే పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండు రోజులుగా వర్సిటీ క్యాంపస్‌లో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని విద్యార్థి లోకం భావిస్తోంది.
ఉస్మానియా యూనివర్సిటీలో పుట్టగొడుగుల్లా ఏర్పడిన జాక్‌ నాయకులపై కామన్‌ స్టూడెంట్స్‌ మరోసారి దాడులకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేసి ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని సాధారణ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు యూనివర్సిటీలో ఐదు జాక్‌లు ఏర్పడి, దేనికవే సొంత ఎజెండాలతో అక్రమ వసూళ్లకు పాల్పడడమే గాక అసలైన తెలంగాణ ఎజెండాను పక్కన బెడుతున్నాయని వీరి ప్రధాన ఆరోపణ. ప్రధాన జాక్‌ నేతలు టిఆర్‌ఎస్‌కు, మరో జాక్‌ లెఫ్ట్‌ భావజాలం, స్వతంత్ర జాక్‌ నేతలు టిడిపి, ఓ కుల సంఘానికి అనుబంధంగా, ఇక మిగతా రెండు జాక్‌లు ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనకుండా వసూళ్లకోసమే దుకాణాలు తెరిచి, ఇలా ఎవరికి వారే జాక్‌ నాయకులమని చెలామని అవుతున్నారని కామన్‌ విద్యార్థులు మండిపడుతున్నారు.