తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగులు చేపడుతున్న సహాయ నిరాకరణోద్యమం ఇప్పుడు ఉన్నతాధికారులకూ కష్టాలు తెచ్చిపెడుతోంది. ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ఆదాయం రాక ఖజానా వెక్కిరిస్తోంది. ఉద్యోగుల ఆందోళనతో పాలనా వ్యవస్థ కుంటుపడి పరోక్షంగా ఇక్కట్లకు గురైన జిల్లా ఉన్నతాధికారులకు తాజాగా ఆర్థిక కష్టాలూ తప్పేలాలేవు. నెలనెలా ఒకటో తేదీనే వచ్చే వేతనం ఈ దఫా అలా వచ్చేలా లేదు.
ప్రతి నెలా 25లోగా వేతనాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తేనే నిర్ణీత సమయానికి ఉద్యోగులకు వేతనాలొస్తాయి. కానీ, ఈనెల 17 నుంచి అన్ని శాఖల ఉద్యోగులు సహాయ నిరాకరణలో పాల్గొంటుండడంతో ఫైళ్లతో పాటే వేతనాల బిల్లులూ తయారు కాలేదు. ట్రెజరీలో వేతనాల బిల్లుల దాఖలుకు శుక్రవారం తుది గడువు కాగా, ఉద్యోగుల సహాయ నిరాకరణోద్యమాన్ని జేఏసీ నేతలు మార్చి 5 దాకా పొడిగించారు. మరోవైపు ట్రెజరీ శాఖ ఉద్యోగులు సైతం సహాయ నిరాకరణలో పాల్గొంటున్నారు. దీంతో వేతనాల బిల్లులకు అక్కడ కూడా మోక్షం కలిగే అవకాశం ఎలాగూ ఉండదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఫిబ్రవరి నెల వేతనాల చెల్లింపు లేనట్టే. దీంతో అటెండర్ నుంచి కలెక్టర్ దాకా ప్రతి ఉద్యోగికీ ఈ నెల జీతం అందేది గగనమే.
ఈ విషయం సహాయ నిరాకరణలో పాల్గొంటున్న ఉద్యోగులు పెద్దగా పట్టించుకోకపోయినా, జిల్లాస్థాయి అధికారులు మాత్రం ఇబ్బందికరంగానే భావిస్తున్నారు. తాము విధులకు సరిగానే హాజరైనా, జీతాలకు వచ్చేసరికి చిక్కులేమిటని వారు అసంతృప్తికి గురవుతున్నారు. కొందరు తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు మాత్రం వేతనాలు నిలిచిపోవడాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. తెలంగాణ కోసం ఒక్క నెల జీతం ఆలస్యమైతే వచ్చిన ముప్పేమిలేదని చెబుతున్నారు