25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

'మార్చి' పరీక్షలకు మంగళం?

ఒక వైపు సహాయ నిరాకరణ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతూ మార్చి 5 వ తేది వరకు ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఉధ్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 5 అనంతరం కూడా ప్రత్యేక తెలంగాణా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టని పక్షంలో మార్చి 6 నుంచి నిరవదిక సమ్మెకు ఉద్యోగులు నోటీసు ఇచ్చేందుకు సంసిధ్దులవుతున్నారు. ఈ నేపద్యంలో విద్యార్ధులు కూడా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు . దీనిలో భాగంగా మార్చి మాసంలో పదవతరగతి, ఇంటర్‌, డిగ్రీ విద్యార్ధులకు వార్షిక పరీక్షలు జరగనుండగా విద్యార్దులు పరీక్షలను బహిష్కరించేందుకు సిద్దపడుతున్నారు. కాగా ఉపాధ్యాయులు, లెక్చరర్లు పరీక్షల విధులను కూడా బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. గురువారం జరగవలసిన డిగ్రీ ప్రీ ఫైనల్‌ పరీక్షను విద్యార్ధులు బహిష్కరించారు. డిగ్రికి మార్చి 24 నుండి, ఇంటర్‌ కు మార్చి 7 నుంచి థియరీ, పదవతరగతికి మార్చి 24 నుంచి పరీక్షలు ఆరంభం కావలసి ఉంది. అయితే విద్యార్ధులు పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితేనే పరీక్షలు రాస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు తాము ఎన్నోరకాలుగా నష్టపోయామని, ప్రస్తుతం జరగనున్న పరీక్షలు రాయకపోతే జరగనున్న నష్టాన్ని కూడా భరించి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్బావానంతరం స్వరాష్ట్రంలో పరీక్షలు రాస్తామని ప్రకటిస్తున్నారు. కాగా ఖైరతాబాద్‌ డిగ్రి కళాశాలలో విద్యార్ధులు శుక్రవారం నుండి రిలే నిరాహార దీక్షలకు సిద్దమయ్యారు.
వార్షిక పరీక్షలను బహిష్కరిస్తే తిరిగి పరీక్షలు నిర్వహిస్తుందా? లేక హాజరు కాని విద్యార్ధులను ఫెయిల్‌ లిస్టులో ఉంచుతారా అన్న విషయమై తీవ్ర చర్చ జరుగుతుంది. పరీక్షల బహిష్కరణ మూలంగా ఇంటర్‌, పదవ తరగతి విద్యార్ధుల పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌ విద్యార్ధులు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ లాంటి కోర్సులలో చేరేందుకు వీలులేకుండా పోయే అవకాశం ఉంది. అలాగే పదవతరగతి విద్యార్ధుల భవిష్యత్‌ కూడా అంధకారంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.