స్త్రీ, పురుష పాత్రలను రంగస్థలంపై ప్రదర్శించడంతో బాటు గాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈలపాట రఘురామయ్య. ఏ నాటకంలో నటించినా ప్రేక్షకుల కోరికపై ఈలపాట పాడక తప్పేదికాదు ఆయనకి. రాముడు, కృష్ణుడుగా రంగస్థలంపై మంచి పేరు తెచ్చుకున్నారు. 'కుచేల' చిత్రంలో కృష్ణుడుగా నటించారు తొలిసారి. 1935 లో విడుదలయిందీ చిత్రం. 1961లో రూపొందిన 'కృష్ణ కుచేల' చిత్రంలోనూ కృష్ణుడుగా నటించారు. కళ్యాణం వెంకటసుబ్బయ్య ఈయన అసలుపేరు. 8వ ఏట నటించిన తొలి నాటకం భక్తరామదాసులో రఘురాముడుగా నటించారు. పెద్దయ్యాక 'భక్త రామదాసు' నాటకంలో 'రఘురాముడు'గా నటించడం చూసాక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 'రఘురామయ్యగా కొనసాగమని 1916లో ఆశీర్వదించడంతో రఘురామయ్య అయి, ఈలపాట రఘురామయ్య అయ్యారు క్రమక్రమంగా.
రంగస్థల నటన కొనసాగిస్తూ 'పృధ్వీపుత్ర' సినిమాతో సినిమానటుడుగా 1933లో కెరీర్ ప్రారంభించి 1975 వరకు మదాలస, గొల్లభామ, శ్రీకృష్ణ తులాభారం ఇలా సుమారు 100 చిత్రాల్లో నటించారు. గుంటూరుజిల్లా సుద్దపల్లిలో 5-3-1900న జన్మించారు. చిన్నతనం నుంచీ సంగీతం తెలియక పోయినా రాగాలాపన పైనే దృష్టి పెట్టి యడవల్లి సూర్యనారాయణ శిక్షణలో గాయకుడు, నటుడు అయ్యారు. 1975లో పరమపదించారు ఈలపాట రఘురామయ్య వర్థంతి ఫిబ్రవరి 24.