1, ఫిబ్రవరి 2011, మంగళవారం

బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1

చిన్నపిల్లలకు బెమ్మానందం, వూళ్ళ వాళ్ళకి బెమ్మిగాడు, అక్షరం ముక్కవచ్చి, సభ్యతతో మాట్లాడాలనుకునే వారికి బ్రహ్మానందం, తొలి సినిమా చూసాక పాత్ర మనసులో ముద్రపడిపోయిన వారికి అరగుండుగానే కొనసాగుతున్నారు బ్రహ్మానందం గిన్నిస్బుక్ఆఫ్వరల్డ్రికార్డులో హాస్యనటుడుగా నమోదు కాకముందు అయిన తర్వాత కూడా.


రేలంగి, రమణారెడ్డి, నాగభూషణం, అల్లురామలింగయ్య, రాజబాబు వీళ్ళు తెరమీద కనిపించగానే (అంతకుముందు వారు నటించిన చిత్రాలు చూసి పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుకున్న కారణంగా) పడీ పడీ నవ్వుతారు. వీళ్ళు విలన్‌ తరహా పాత్రలు చేసినా హావభావాలు కిసుక్కున నవ్వేటట్టు చేస్తాయి. ఈ కోవలోకి చేరినందుననే బ్రహ్మానందం కూడా తెరమీద కనిపించగానే ఏ డైలాగూ చెప్పక పోయినా నవ్వు వచ్చేస్తుంది. కొంటె చూపులు, తిక్కతిక్కగా వున్నట్టు కనిపించడం, వెంగళాయిలా ప్రవర్తించడం, పెదవులు బిగించడం, లేదా రెండు చేతులూ తలమీద పెట్టుకోడం, నడిచే తీరు, ఇతర మేనరిజాల వల్ల ప్రేక్షకులకు చచ్చినట్టు అంటూ నిజంగా చచ్చినట్టు కాదు అసంకల్పికంగా నవ్వేస్తారు, నవ్వుకుంటారు, నవ్వుతూంటారు.

ఇక డైలాగ్స్‌ కూడా పాత్ర స్వభావానికి అనుగుణంగా రూపొందినట్లైతే అవి పేలిపోయి, థియేటర్ని నవ్వులతో పేల్చేస్తాయి. పక్కవాళ్ళు భుజాలు నొప్పి పెట్టడం వల్లనో, వీపు మార్మోగడం వల్లనో బాధపడే సందర్భాలు, ఆ బాధని వచ్చే నవ్వులో మరచిపోవడాలు కామన్‌. ఇంకా బెమ్మానందంని చూసిన తరువాత కడుపునొప్పి వచ్చినా, పళ్ళు కటకటాడినా, పెదవిగాని, నాలుక గాని కొరుక్కోవడం వల్ల రక్తం చిందినా ఆ బాధలు తెలియడానికి కొంత టైమ్‌ పడుతుంది. తెలిసాక అనుభవించిన భోగం వల్ల బాధ అంతగా బాధించదు.

గతంలో కామెడీ ఆర్టిస్టులు అవసరం వుండేది సినిమాకి. జంధ్యాల ప్రారంభించిన కామెడీ చిత్ర యజ్ఞం ఊపు అందుకుని ఇ.వి.వి. సత్యనారాయణ, రేలంగి నరసింహారావు వంటి దర్శకులుతో మహాయజ్ఞంగా మారి కామెడీ కామెడీ ఆర్టిస్టులు అవసరం కాదు అత్యవసరం అనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏర్పడటానికి కారకుల్లో ఒకరైన బ్రహ్మానందం పుట్టినరోజు ఫిబ్రవరి 1.