దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి తానే అనేక సలహాలిచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జగన్ వర్గం నేత, సినీనటి రోజా ముఖ్యమంత్రికి సూచించారు. సలహాలివ్వడం గొప్పతనం కాదని, కార్యక్రమాల్ని అమలు చేయడమే గొప్ప అని ఆమె అన్నారు. పేద ప్రజల కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్ని అమలు చేశారని రోజా తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ గూడు కట్టుకున్నారన్నారు.
రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమౌతున్న ప్రజలకు మంచి నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అంత్యాక్షరి సాగుతోందని రోజా ఆరోపించారు. జగన్‌పై ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు వంత పాడుతున్నాయన్నారు. పరిటాల హత్యకేసులో జగన్‌కు ఎలాంటి సంబంధంలేదన్న విషయం అందరికి తెలిసిందేనని అన్నారు.
రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కలిసిపోయి జగన్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. జగన్‌పై ఆరోణలు చేయకుండా ఏమైనా ఆధారాలుంటే చూపాలని ఆమె డిమాండ్ చేశారు.