24, ఫిబ్రవరి 2011, గురువారం

మార్చి 1తర్వాత తాడోపేడో ...

తెలంగాణపై మార్చి 1వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. గురువారం లోకసభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిన్న తెలంగాణపై గళమెత్తిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నోళ్లకు ఈ రోజు ఎందుకు తాళాలు పడ్డాయో వారే చెప్పాలని డిమాండు చేసారు. రేపటి రైల్వే బడ్జెట్‌ను, ప్రధాని ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తామని ఆయన అన్నారు.

మొదటి రోజు జెపిసి కోసం సహకరించాలని ప్రతిపక్షాలు అడిగాయని,దాంతో మొదటి రోజు తాము తెలంగాణపై పట్టుబట్టలేదని, బడ్జెట్ ప్రతిపాదన ముగిసే వరకు ఆగాలని తమను ఎన్‌డిఎ కోరిందని, దాంతో తాము ఆ తర్వాతే తెలంగాణ బిల్లు కోసం పట్టుబట్టాలని.. తెలంగాణపై పార్లమెంటును స్తంభింపజేద్దామని ప్రతిపక్షాలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తమకు ప్రతిపక్షాలన్నీ సహకరించాయని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని.. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు తాము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.