తమిళ ప్రజానీకంలోని పలువురు అమ్మగా తలుస్తూ, పురోచ్చి తలైవి (విప్లవ నాయిక) గా ఆరాధిస్తారు జయలలితను. నలుగుసార్లు తమిళనాడు శాసన సభ్యురాలిగా ఎన్నికై రెండుసార్లు ముఖ్యమంత్రిగానూ పాలించి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగుతున్న జయలలిత తొలుత తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా తన అందచందాలతో, ముద్దు ముద్దుగా డైలాగ్స్ పలుకుతూ అలరించారు. జయలలిత తమిళ పత్రికలకు పలు వ్యాసాలు కూడా రాసారు నటనకు బ్రేక్ పెట్టాక. సినీ నటి సంధ్యకుమార్తె అయిన జయలలిత కర్ణాటకలోని మెలుకొటెలో 1948 పుట్టి, బెంగుళూరులో కొంతకాలం చదువుకున్నారు. తల్లితో, తమిళనాడుకు మకాం మార్చడంతో మిగతా చదువు మద్రాసులో సాగింది. తల్లి నటి కావడంతో తల్లి ప్రోత్సాహంతో నాలుగో ఏట నుంచే భరతనాట్యం నేర్చుకొని 1965లో నటననే వారసత్వంగా భావించి 13వ ఏట 'ఎపిస్టిల్' అనే ఆంగ్ల చిత్రంతో నటనకు శ్రీకారం చుట్టారు. జయలలిత కన్నడంలో నాయికగా నటించిన తొలిచిత్రం 'చిన్నాడ గొంబె', తెలుగులో అక్కినేని హీరోగా నటించిన 'మనుషులు మమతలు' మంచి విజయం సాధించాయి. మనుషులు మమతలులో అక్కినేనిని ఆటపట్టించే యువతిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు.
ఎం.జి.రామచంద్రన్ సరసన నాయికగా 28 చిత్రాల్లో, శివాజీగణశన్తో 14 చిత్రాల్లో, జెమినీ గణశన్తో, జయశంకర్‌తో నాలుగేసి చిత్రాల్లో, ముత్తురామన్, రవిచంద్రన్‌లతో రెండేసి చిత్రాల్లో, ధర్మేంద్రతో 'ఇజ్జత్' అనే ఒక హిందీ చిత్రంలో జయలలిత నాయికగా నటించారు. 1969 విడుదలైన అడిమయప్పన్ చిత్రంలో కె.వి. మహదేవన్ సంగీత దర్శకత్వంలో ఒక పాట పాడటంతో గాయనిగా అవతారం కూడా ఎత్తి, సూరియకాంతి, వైరం, అన్బతెడి తిరు మాంగల్యం, ఉన్నయ్ సుత్రమ్ ఉలగం' తదితర చిత్రాల్లో పాటలు పాడి చక్కని గాయనిగానూ గుర్తింపు పొందారు.
తెలుగులో అక్కినేని సరసన కథానాయికగా 'మనుషులు మమతలు'తో కెరీర్ ప్రారంభించి ఆయనతో అదృష్టవంతులు, ఆస్తిపరులు, భార్యాభర్తలు, భార్యాబిడ్డలు, ఆదర్శకుటుంబం తదితర చిత్రాల్లొ, ఎన్టీఆర్‌తో నిలువుదోపిడి, కథానాయకుడు, కదలడు వదలడు, గోపాలుడు భూపాలుడు, దేవుడు చేసిన మనుషులు, బాగ్దాద్ గజదొంగ, కృష్ణతో గూఢచారి 116, శోభన్‌బాబుతో డాక్టర్ బాబు, జగ్గయ్యతో ఆమె ఎవరు తదితర చిత్రాల్లో నట్టించారు. స్విమ్ సూట్‌లోనే కాదు. చీరకట్టులోనూ, ఆధునిక వస్త్రాల్లోను బొద్దుగా వుండే జయలలిత ఆరోజుల్లో ప్రేక్షకుల కలలరాణి. నదియై తేడి వందా కదల్ ఆమె 1980లో నటించిన చివరి చిత్రం.
ఎం.జి.ఆర్‌ని బాగా అభిమానించిన జయలలిత 1981లో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. పార్టీలో జేరి రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. ఎం.జి.ఆర్. మరణానంతరం ఎం.జి.ఆర్ భార్య జానకి రామచంద్రన్ వారసురాలే అయినా తరువాత వచ్చిన మార్పులతో జయలలితనే వారసురాలిగా నిర్ణయించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి కాగలిగారు. రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించి, కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. కలైమామణి జయలలిత పుట్టినరోజు ఫిబ్రవరి 24.