తెలంగాణ అంశంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని.. పార్లమెంట్‌లో ఎంత వత్తిడి తెచ్చినా... నిరసన తెలియజేసినా తెలంగాణపై ప్రభుత్వం స్పందించలేదని టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు.
గురువారం ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ .. టీఆర్ఎస్‌కు మద్దతుగా ఎన్డీయే, సీపీఐ మద్దతు తెలిపాయని, తెలంగాణలో ప్రజలు తిరగనివ్వరని భయంతో.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం మొక్కుబడిగా మాట్లాడారు తప్పితే పూర్తి ఆసక్తి కనబర్చలేదని రాములమ్మ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావటం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టం లేనట్లుగా ఉందని..టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అంటూ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని...లేకుంటే..తెలంగాణ ప్రజలు రోడ్లమీదకి వస్తే ఈజిప్ట్ తరహా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. ఏదీ ఏమైనా తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుందని ఆమె స్పష్టం చేస్తునే ఎప్పుడు అనే ప్రశ్నకు మాత్రం సమయమొచ్చినప్పుడని ముక్త సరిగా సమాధానమిచ్చారు.