ప్రతి పేదవాడు బాగా చదవాలని, ప్రతి పేద కుటుంబం నుంచి ఓ వ్యక్తి అయినా ఉన్నత చదువులు చదవాలని, తద్వారా ఆ కుటుంబం బాగుపడాలని తాను ఈ దీక్ష చేశానని.. బడ్జెట్‌ను సవరించి విద్యార్థులకు సరిపడా కేటాయింపులు జరపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ హెచ్చరించారు.
ఫీజు రీయంబర్స్‌మెంట్ సమస్యపై ఏడు రోజుల పాటు సాగించిన దీక్షను విరమించిన తర్వాత ఆయన గురువారం సాయంత్రం ప్రసంగించారు. ఒక్క దూత కూడా తన వద్దకు రాలేదని తాను బాధపడలేదని, 25 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బ తీసిందని, పేద విద్యార్థులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని కొనసాగినిస్తే తప్పు చేసినవారమవుతామని.. పేద ప్రజల కోపాగ్నిలో ప్రభుత్వం కొట్టుకుపోతుందని ఆయన అన్నారు.
ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఒక్క రోజు దీక్ష చాలదని, ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలంటే బడ్జెట్ పెట్టే సమయంలో ఒత్తిడి పెరగాలంటే తాను వారం రోజుల పాటు దీక్ష చేయాలని భావించానని..3,450 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, మళ్లీ అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వం కేవలం 3 వేల కోట్లు మాత్రమే కేటాయించి, చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు. నామమాత్రంగా కేటాయింపులు జరిపి విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారని.. తాను రామరాజ్యాన్ని చూడలేదు గానీ వైయస్ రాజశేఖర రెడ్డి సువర్ణ రాజ్యం చూశానని..మళ్లీ ఆ రాజ్యాన్ని తీసుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని.. ఇందుకు అంతా కారోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు జగన్.