24, ఫిబ్రవరి 2011, గురువారం

రాష్ట్ర విభజన ఎప్పుడు ఎలా?

కొందరు వేర్పాటువాద పార్టీల నాయకులు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలని బంద్‌లు చేయించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులచే విధ్వంసాలు సృష్టించి ఇప్పుడు సహాయ నిరాకరణ చేసి భూకంపాలు సృష్టిస్తామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నది.

ఈ వేర్పాటువాదం 7 కోట్ల పేద ప్రజల మేలు కోసం కాదు. అంటే 80 శాతం పేదరికాన్ని పక్కన పెట్టేసి అధికార ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు కేవలం అధికారం కోసమే రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. రాష్ట్రంలోను 23 జిల్లాలలోని మూడు కోట్ల కుటుంబాలలో 2 కోట్ల 30 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డులిచ్చారు. అంటే 80 శాతం పేదరికం 23 జిల్లాలలోను ఉందని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. 80 శాతం పేద ప్రజలపై కుటిల ప్రేమను, కపట ప్రేమను చూపించి రాష్ట్రాన్ని విభజించాలని అంటే కేవలం అధికారం కోసమే విభజించాలని విధ్వంసాలు సృష్టిస్తూ సోనియాగాంధీని కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.

ఒక్క సిపిఐ(ఎం) పార్టీ తప్పించి అన్ని అధికార ప్రతిపక్ష శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. నల్ల ధనవంతులు వేర్పాటు వాదానికి డబ్బు సరఫరా చేసి అధికారం కోసమే రాష్ట్రాన్ని విభజించాలని రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారు. రాష్ట్రాన్ని విభజిస్తే 20 శాతం ఉన్న నల్లధనవంతులకే అధికారం వస్తుంది. 80 శాతం పేదరికాన్ని నిర్మూ లించాలనే ధ్యేయంతోనే 20 రాష్ట్రాలలో నక్సలిజం పుట్టిందనేది నగ్నసత్యం. భూమిని జాతీయం చేసి భూములు పంచి, గనులను, వ్యాపారాన్ని, పరిశ్రమలను జాతీయం చేస్తే నక్సలిజమే మాయమైపోతుంది. అసలు 80 శాతం పేద ప్రజలకు రాజుపాలించినా ఒక్కటె, రెడ్డి పాలించిన ఒక్కటె. కాబట్టి భూమిని జాతీయం చేసి స్వంత ఆస్తిహక్కును రద్దు చేసిన తరువాత మాత్రమే రాష్ట్రాలను విభజించాలి.