24, ఫిబ్రవరి 2011, గురువారం

రంగుల్లో”లక్ష్మీ కటాక్షం’

ఎన్టీరామారావు, కె.ఆర్‌.విజయ ప్రధాన పాత్రలు పోషించిన 'లక్ష్మీ కటాక్షం' చిత్రాన్ని రంగుల్లో అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'మాయాబజార్‌' ని రంగుల్లో అందించగా ఘనవిజయం సాధించింది. దేవానంద్‌ నటించిన 'హమ్‌ దోనో'ని కలరింగ్‌ చేసి ఇటీవల విడుదల చేయగా విజయం సాధించింది. ఈ స్ఫూర్తితో గోల్డ్‌ స్టోన్‌ టెక్నాలజీ స్‌ లిమిటెడ్‌ సంస్థ రంగుల చిత్రంగా 'లక్ష్మీ కటాక్షం'ని రూపొందించే ప్రయత్నాలు చేబట్టారు బి. విఠలాచార్య దర్శకత్వంలో పి.ఎస్‌.ఆర్‌. పతాకాన పింజల సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం 8-1-1970న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. ఇది ఎన్టీఆర్‌ నటించిన 175 వ చిత్రం.

రాజశ్రీ, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, బాలయ్య, మిక్కిలినేని, బాలకృష్ణ, హేమలత ముఖ్యపాత్రలు పోషించిన 'లక్ష్మీకటాక్షం'కి పాటలు సి. నారాయణరెడ్డి, కొసరాజు, చిల్లర భావనారాయణ రాయగా సంగీతం ఎస్‌.పి. కోదండపాణి సమకూర్చారు. ఘంటసాల, సుశీల, జానకి, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి పాటలు పాడారు. కె.ఆర్‌.విజయ, రాజశ్రీ, ఎన్టీఆర్‌తో చిత్రీకరించిన పలు శృంగార గీతాలున్నాయి.

'అమ్మమ్మమ్మో తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే', 'రా వెన్నెలదొరా కన్నియ్యను చేరా', 'అందాల బొమ్మను నేను', 'కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెెమ్మో', 'నా వయసు సుమగంధం నాదు మనసు మకరందం', 'పొన్నచెట్టు మాటున పొద్దు వాలిపోతుంది', 'స్వాగతం స్వాగతం', 'శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు', 'సకల విద్యామయీ ఘన శరదిందు', 'జయజయ మహాలక్ష్మి జయ మహాలక్ష్మి' వంటి పాటలు, 'ధన్యోస్మి ధన్యోస్మి' అనే శ్లోకం అలరించాయి ప్రేక్షకులను, శ్రోతలను.