జై బోలో తెలంగాణ చిత్రాన్ని మహలక్ష్మి ఆర్ట్ ్స పతాకాన ఎన్. శంకర్ నిర్మించారు. సందీప్ మీరానందన్, జగపతిబాబు, స్మృతి ఇరాని, నాగినీడు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం చక్రి, సినిమాటోగ్రఫీ సురేందర్‌రెడ్డి నిర్వహించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎన్. శంకర్.
ఈ చిత్రాన్ని 9 మంది సభ్యులతో కూడిన రివైజింగ్ కమిటీ 11 కట్స్‌తో 67.08 అడుగుల ఫిలిం కత్తిరించి, 31-01-2011న 'ఎ' సర్టిఫికెట్ జారీచేసింది.
1. వాయిస్ ఓవర్‌తో పాటు 'చారిత్రక, భూమిక ఆధారంగా కొన్ని వాస్తవ సంఘటనలను కొన్ని కల్పిత సన్నివేశాలను, సంస్థలను జోడించి తీసిన చిత్రం. ప్రేక్షకులు గమనించగలరు, అనే అంశాన్ని చూపాలని కోరితే ఆ విధంగా వాయిస్ ఓవర్‌తో చూపించారు.
2. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్న రాజకీయ నాయకులను, మన గ్రామం రాకుండా అడ్డుపడదాం' అనే డైలాగ్‌ని సౌండ్‌తో సహా తొలగించారు.
3. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన ఇంటర్వ్యూలో రిఫరెన్స్‌గా పేర్కొన్న కులాలు, శ టు ష తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
4. మూడు నాలుగు రీళ్ళలో 'నీకు అవేమన్నా రెండు ఉన్నాయా' అనే డైలాగ్ తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.
5. ఏడవ రీలులో విద్యార్థి ఆహుతి అయ్యే దృశ్యాలను 50 శాతం తగ్గించమని, అంబేద్కర్‌తో చారి డైలాగ్‌ని ట్రాన్స్‌లోగాని ఊహలోగాని ఉన్నట్టు మార్చాలని కోరడం ద్వారా 40 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరపాలయింది.
6. తొమ్మిది పది రీళ్ళలో
ఎ) తెలంగాణ రాకుండా చాలా సూట్‌కేసులు అడ్డు పడుతున్నాయి
బి) ఇదా చిదంబర రహస్యం
అని ఉన్న డైలాగ్స్‌ని సౌండ్‌తో సహా తొలగించారు.
7. పదకొండు పన్నెండు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలోగల 'అయితే చంపుతాం... చంపుతాం... తెలంగాణకు అడ్డు వచ్చిన వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరుకుదాం నరుకుదాం... తెలంగాణకి అడ్డువచ్చిన వాళ్ళను తరిమి తరిమి తరిమి కొడదాం' అనే డైలాగ్ సౌండ్‌తో సహా తొలగింపుకు గురి అయింది.
8. పదకొండు పన్నెండు రీళ్ళలో గల 'డిసెంబరు 9న చిదంబరంగారు ఏమి మాటిచ్చారు' డిసెంబరు 23న ఏ మాటిచ్చారు డైలాగ్‌ని తొలగించి శబ్దం రాకూడదన్నారు.
9. పదకొండు పన్నెండు రీళ్ళలో విద్యార్థులను పోలీసులు హింసించే దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమనడం ద్వారా 27.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
10. పదమూడు పద్నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన 'తెలంగాణ జాతరొచ్చెరా' పాటలో గల 'పన్నులు కట్టొద్దుర' అనే పదాల్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
14 రీళ్ళ నిడివిగల 'జై బోలో తెలంగాణ' చిత్రం 4-2-2011న విడుదల అయింది.