24, ఫిబ్రవరి 2011, గురువారం

నటిస్తూ మరణం ఆహ్వనించిన ముక్కామల

దుర్యోధనుడుగా మాయాబజార్‌, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాల్లో, విశ్వామిత్రుడుగా సత్యహరిశ్చంద్ర, సీతా కళ్యాణం చిత్రాలలో, గురువుగా గురువుని మించిన శిష్యుడు, విరాటురాజుగా నర్తనశాలలో, 'ముత్యాలముగ్గు'లో విలన్‌గా ముక్కామల ప్రత్యేకమైన పొడవైన పెర్సనాల్టిd, ప్రత్యేక తరహాలో డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నారు. విలన్‌గా పలు చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. విలన్‌గా ఎంటరై హీరోగా నటించి మళ్ళీ విలన్‌ తరహా పాత్రలకు ఆ తరువాత కేరక్టర్‌ రోల్స్‌కి పరిమితమైన ముక్కామల రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా సమకూర్చారు.

కోపాన్ని, కాఠిన్యాన్ని మాటల్లో, భావాల్లో పలికిస్తూ, పళ్లు నూరినట్టుగా కూడా కనిపించి తన ఆగ్రహాన్ని ప్రదర్శన చేయడంలోనూ, పట్టరాని కోపం వున్నా సందర్భం లేనపుడు అదిమిపట్టి, దాన్ని వ్యంగ్యంగా ప్రదర్శించడం లోనూ ముక్కామల అభినయానికి మంచి మార్కులు పడేవి.

1920లో గుంటూరులో జన్మించిన ముక్కామల ఎ.సి.కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడుగానూ, టెన్నిస్‌ ఆటగాడుగాను గుర్తింపు పొందారు. తొలుత షేక్‌స్పియర్‌ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి. కె.వి.ఎస్‌.శర్మ ఎన్టీఆర్‌, జగ్గయ్య ఒక సంస్థద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శిస్తూవుంటే, తనూ ఆ నాటకాల్లో కీలకపాత్రలు పోషించేవారు. తను స్వయంగా భక్త కబీర్‌, నాటకం రాసి ప్రదర్శించి ప్రశంసలూ పొందారు.

డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసు చేరుకుని, సినీ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. రంగస్థల నటుడుగా సి. పుల్లయ్యకు పరిచయమయ్యాక హీరో కావాలనే ఉద్దేశ్యంతో ఆ పరిచయం పెంచుకున్నారో, మరో రకంగా పెంచుకున్నారో గాని, పి. పుల్లయ్య వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరి, అది చేస్తూనే 'మాయా మచ్ఛీంద్ర' చిత్రంలో గోరఖ్‌నాథ్‌గా కీలకమైన పాత్ర పోషించి సినీ నటన ప్రారంభించారు. 1945లో విడుదలైన ఆ సినిమా అంతగా ఆడక, ముక్కామలకు గుర్తింపు రాలేదు గాని, సహాయ దర్శకుడుగా కొనసాగారు పుల్లయ్య వద్ద కొన్ని చిత్రాలకు. ఆ తరువాత రామకృష్ణ దర్శకత్వంలో భరణి పతాకాన రూపొందిన 'లైలా మజ్ను'లో లైలా పాత్ర పోషించిన భానుమతి తండ్రిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడుగా.

మాంత్రికుడిగా స్వప్నసుందరి, విలన్‌గా నిరపరాధి తదితర చిత్రాల్లో చేసాక, హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'నిర్దోషి' చిత్రంతో హీరో అయ్యారు. అలా ఆయన కోరిక హెచ్‌.ఎం.రెడ్డి ద్వారా తీరిందిగాని, అప్పట్లో హీరోలు అందంగానే వుండాలనే తలచే దర్శక నిర్మాతల కారణంగా మళ్ళీ విలన్‌ పాత్రలవేపే మళ్ళారు. అయినా సహాయ దర్శకుడుగా లభించిన అనుభవంతో 'మరదలు పెళ్ళి' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి, అందులో హీరోగా నటించారు సినిమా సరిగా ఆడలేదు. అయితే 'పరోపకారం' చిత్రంలో మళ్ళీ హీరోగా నటించే అవకాశం వచ్చింది. సినిమా పరాజయంతో హీరో ఛాన్స్‌లు కొండెక్కాయి. 1951లో 'నిర్దోషి'లో. 1952లో మరదలి పెళ్ళి, 1983లో పరోపకారం ఈ మూడు చిత్రాల్లోనూ హీరో. నిర్దోషి ఆడినా, మిగతా రెండూ పరాజయం చెందాయి. తన విధివ్రాత విలన్‌, విలన్‌ తరహా పాత్రలకే అనే నిర్ణయానికి వచ్చి ఆ పాత్ర పోషణలో ఒక శైలిని ఏర్పరుచుకుని చిత్ర చిత్రానికీ పేరు పెంపొందించుకున్నారు. తమిళ, కన్నడ, చిత్రాల్లోను పలు పాత్రలు పోషించారు. 'ఋష్యశృంగ' చిత్రాన్ని డైరెక్ట్‌ చేసారు. ఆ చిత్రం కూడా సక్సెస్‌ కాక మళ్ళీ డైరక్షన్‌ జోలికి వెళ్ళలేదు.

కథలు రాయడం, ఫొటోలు తీయడం, పెయింటింగ్‌ వేయడం ముక్కామల హాబీలు. నటుడయ్యాక ఎక్కడ టెన్నిస్‌ పోటీలు జరిగినా చూడటమే గాని, ఆడడం తగ్గించేసాననేవారు. పలు చిత్రాల్లో నటించినా, ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉండేది తర్వాత తర్వాత. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తూనే 1987లో మృతిచెందారు. ముక్కామల జయంతి 28.