9, డిసెంబర్ 2011, శుక్రవారం

ఎఫ్‌డిఐ నిలిపిన మధ్యంతర0

  • ఎఫ్‌డిఐ మంచిదే కానీ.. మిడ్‌ పొల్స్‌ను మేం కోరుకోవడం లేదు:ప్రణబ్‌ ముఖర్జీ
న్యూఢిల్లి: రిటైల్‌ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) అనుమతించాలని కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం తప్పుకాదని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. అయితే మధ్యంతర ఎన్నికలను నివారించడానికే యుపిఎ సర్కార్‌ వెనక్కు తగ్గిందని ఆయన పేర్కొనడం గమనార్హం. గురువారం ఉదయం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుల సమావేశంలో ప్రణబ్‌ ముఖర్జీ మాట్టాడుతూ ప్రతిపక్షాల ఒత్తిడితో ఏకాభిప్రాయం కుదిరే వరకు ఎఫ్‌డిఐపై నిర్ణయం నిలిపివేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం(పిఎంఒ) ప్రకటించిందని తెలిపారు. సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించే వరకు ఎఫ్‌డిఐ నిర్ణయం నిలుపుదల చేసినట్లు ఆర్థికమంత్రి ఎంపీల సమావేశంలో స్పష్టం చేశారు. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐలను అనుమతించడం వల్ల వాల్‌-మార్ట్‌, టెస్కో వంటి సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తాయని, ఫలితంగా వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కొత్త విధానాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యానించిన విషయం విదితమే.
ప్రధాని నిర్ణయాన్ని అనేక విదేశీ కంపెనీలు స్వాగతించాయి. అయితే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎఫ్‌డిఐని తీవ్రంగా వ్యతిరేకించడంతో యుపిఎ సర్కార్‌ రెండు వారాల క్రితం తీసుకున్న నిర్ణయంపై పున: పరిశీలించి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. లోక్‌సభలో 18 మంది సభ్యులున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ యుపిఎలో కాంగ్రెస్‌ తరువాత రెండో అతిపెద్ద పార్టీ కావడం గమనార్హం. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐలను అనుమతించడాన్ని అంగీకరించబోమని మమత స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇరుకునపడింది. ఎఫ్‌డిఐలను ఉపసంహరించుకోకపోతే పార్లమెంటును సజావుగా నడవనీయమని బిజెపి, వామపక్షాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం ఎఫ్‌డిఐపై తన నిర్ణయాన్ని వాయిదే వేసుకోవాలని లేదా తమ విధానంపై ఓటింగ్‌కు సిద్ధం కావాలని బిజెపి, వామపక్షాలు సవాలు చేశాయి. మమత మద్దతు లేకపోతే ప్రభుత్వానికి లోక్‌సభలో బొటాబొటిగా మాత్రమే బలం ఉంటుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వానికి జరిగే నష్టం అపారం. కాగా, ఎఫ్‌డిఐపై తమ విధానాన్ని ఉపసంహరించుకోలేదని, కేవలం ఏకాభిప్రాయ సాధనలో భాగంగా నిర్ణయం వాయిదా వేసినట్లు ప్రభుత్వం వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించేంత వరకు ఎఫ్‌డిఐని ప్రవేశపెట్టబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుపితో సహా ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లిd ఎన్నికలు జరుగనుండటం, తృణమూల్‌ వంటి మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించడంతో తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మినహా ప్రభుత్వానికి మార్గాంతరం లేకపోయింది. యుపిఎ సర్కార్‌ ఎటువంటి రిస్క్‌ తీసుకోడానికి సిద్ధంగా లేకపోవడం గమనార్హం.