9, డిసెంబర్ 2011, శుక్రవారం

అటకెక్కిన 'ఆధార్‌'

దేశ పౌరులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న బృహత్తర లక్ష్య సాధనకోసం ఇన్ఫోసిస్‌ మాజీ చైర్మన్‌ నందన నీలేకని రూపొందించిన యూనిక్‌ గుర్తింపు కార్డుల (ఆధార్‌ కార్డుల) పథకానికి సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం తోసిపుచ్చింది. దీని స్థానే అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త బిల్లును తీసుకుని రావాలని ప్రభుత్వానికి కమిటీ సూచించింది. “యూనిక్‌ ఐడెంటిటీ అధారిటీ అథారిటీ (యుఐడిఎఐ) బిల్లుపై కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇదివరకే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అయితే, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ గుర్తింపు కార్డుల జారీ పథకం పనులను నందన్‌ నీలేకనికి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అప్పగించారు.
ఈ పథకాన్ని అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారు. చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐలను) ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలే కాక, యుపిఎలోని భాగస్వామ్య పార్టీలు వ్యతిరేకించడం వల్ల ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం నిలిపి వేయాల్సి వచ్చింది. తిరిగి అటువంటి చేదు అనుభవం ఎదురుకాకుండా, యుఐడిఎఐ బిల్లుకు బదులుగా కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని పార్లమెంటు స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. యుఐడిఎఐ బిల్లుపై కేంద్ర మంత్రి వర్గంలోనే ఏకాభిప్రాయం లేదు. 2-జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం విషయంలో ఇప్పటికే ప్రధానికీ ఆర్థిక, హోం మంత్రులకూ మధ్య పొరపొచ్చాలు తలెత్తాయి. ఈ తరుణంలో యుఐడిఎఐ బిల్లును బలవంతంగా ప్రవేశపెట్టి మరో చిచ్చును సృష్టించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా, ఈ పథకం అటు కాంగ్రెస్‌ ప్రణాళికలో కానీ, యుపిఎ ఉమ్మడి ప్రణాళికలో కాని లేదు. ఆధార్‌ కార్డుల పథకం హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌)కి పోటీ వస్తుందేమోనన్న సందేహాలను హోం మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. పైగా, జాతీయ భద్రత ప్రయోజనాల దృష్ట్యా ఆధార్‌ పథకాన్ని అనుమతించడం మంచిది కాదని కూడా ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాక, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా యుఐడిఎఐ పథకం పత్రాలను ఆడిట్‌ చేయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాక, యుఐడిఎఐ పథకం సేకరించిన వివరాలు నమ్మదగినవిగా లేవని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. యుఐడిఎఐకి అయ్యే వ్యయంలో సగం మొత్తంతో 2014 నాటికి దేశంలోని ప్రజలందరి వివరాలను సేకరించడం సాధ్యమేనని ఎన్‌పిఆర్‌ ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. అంతేకాక, ఆధార్‌ కార్డుల కోసం ప్రైవేట్‌ సంస్థల ద్వారా సేకరించే బయోమెట్రిక్‌ సమాచారం విశ్వసించ దగినదిగా ఉండకపోవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అంతేకాక, ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి సున్నితమైన, కీలకమైన సమాచారం చేరడం భద్రతా ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదని హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అన్నింటికీ మించి రాజకీయ నాయకులు తమ పరిధిలోని అంశాల్లోకి వృత్తివిద్యారంగాల్లోని వారిని రానివ్వరన్న నానుడి కూడా అసత్యం కాకపోవచ్చు. అందువల్ల ఇన్ఫోసిస్‌ వంటి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఐటి కంపెనీ అధిపతిగా విశేషమైన ప్రతిభను చూపిన నీలేకని ఈ వ్యవస్థలో ఇమడలేకపోయారనడానికి తాజా ఉదాహరణ.