'సినిమా ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు
ఆకర్షణీయంగా చూపించవచ్చు. కానీ అంతర్లీనంగా మన సమకాలీన జీవితంలో సామాన్య
జనం చవిచూసే సమస్యలు, వాటిని ఎదుర్కోడానికి జరిగే పోరాటాలు
ప్రతిబింబించాలని భావిస్తాను' అంటారు ప్రసిద్ధ దర్శకుడు శంకర్. తాజాగా ఆయన
హిందీ చిత్రం 'త్రీ ఇడియట్స్' ఆధారంగా - మన విద్యా విధానం తీరు తెన్నులు,
యువకుల ఆలోచనా ధోరణిని వినోదభరితంగా చూపే చిత్రాన్ని తీస్తున్నారన్నది
తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ''నేను డిఎమ్‌ఇ
ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. కానీ బిఇ చదవాలనుకుంటే సీటు దొరకలేదు. చదువుల
తల్లిని - డబ్బులిచ్చి కొనుక్కునే దుస్థితికి లోనవ్వడం ఇష్టంలేక, నా
ధ్యేయాన్ని మార్చుకుని చిత్రరంగంలో సహాయ దర్శకుడిగా ప్రవేశించాను.
అప్పట్లోనే ఒక వార్త పేపర్లో వచ్చింది. ఓ విద్యార్థి - మామూలుగా సీటు
దొరక్క, వికలాంగుల కోటాలో అయితే దొరుకుతుందన్నారని, తన వ్రేలిని తాను
నరుక్కుని, దరఖాస్తు చేసుకున్నాడట! ఆ వార్త నన్నెంతగానో కలచివేసింది.
అలాంటి అనుభవాల నేపథ్యంలోంచే 'జెంటిల్‌మేన్' (అర్జున్) కథను
రూపొందించాను. జీవితానికి దూరంగా ఉండే సినిమాలలో ఎన్ని గొప్ప ఆకర్షణలను
చొప్పించినా, అవి జనాన్ని ఆకట్టుకోలేవని నా నమ్మకం'' అంటారు శంకర్.