మరో రెండు నెలల వరకూ జగన్ మద్దతు
ఎమ్మెల్యేలపై వేటు పడకపోవచ్చు. ఎందుకంటే... ఉప పోరు అంటూ జరిగితే అది
ఫిబ్రవరిలోనే ఉండొచ్చు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభల్లో సీటు ఖాళీ
అయిన ఆరు నెలల్లోపు ఎన్నిక నిర్వహించాలి. ఈ లెక్కన మహబూబ్‌నగర్ జిల్లాకు
చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి అక్టోబర్ 30న మృతి చెందారు.
ఈ తేదీని పరిగణలోనికి తీసుకుంటే, ఏప్రిల్ 30లోపు ఉప ఎన్నిక నిర్వహించాలి.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అక్టోబర్ 8న ముసాయిదా విడుదలతో
మొదలైంది. డిసెంబర్ మూడో తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో
తప్పుల సవరణ, ఫొటోల సేకరణ కార్యక్రమం సాగుతుంది. డిసెంబర్ 17 వరకు
దరఖాస్తుల విచారణ తతంగాన్ని పూర్తి చేసి జనవరి 5న సవరించిన తాజా జాబితాను
ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎన్నికల నిర్వహణ ఉండదు. ఏప్రిల్
వరకూ గడువు ఉన్నా... మార్చి, ఏప్రిల్‌లో విద్యార్థుల పరీక్షలుంటాయి.
సిబ్బంది కొరత, పోలింగ్ కేంద్రాల సమస్య ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరిలోనే
ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే అప్పటికే ఖాళీగా ఉన్న అన్ని
స్థానాలను నోటిఫికేషన్ పరిధిలోకి తెస్తారు. ఇప్పటికిప్పుడు జగన్
మద్దతుదారులపై వేటు వేస్తే... ఫిబ్రవరిలోనే ఆ స్థానాల్లో ఎన్నికలు
జరుగుతాయి. ఈ కొద్ది సమయంలో ఉప ఎన్నికలకు వెళ్ళడం అధికార పార్టీకి తలనొప్పే
కావచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, అనర్హత పిటిషన్లను ఫిబ్రవరి వరకూ
పెండింగ్‌లో ఉంచే వీలుంది.