అక్రమ మైనింగ్ కేసులో కేంద్ర విదేశాంగ శాఖ
మంత్రి ఎస్. ఎం. కృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఈ కుంభకోణంపై కృష్ణతోపాటు మాజీ
ముఖ్యమంత్రులు ఎన్. ధరంసింగ్ (కాంగ్రెస్), హెచ్. డి. కుమారస్వామి
(జనతాదళ్ - సెక్యులర్)లపై కర్నాటక లోకాయుక్త కేసు నమోదు చేసింది. వీరు
వారి వారి హయాంలో అక్రమ మైనింగ్ లీజులకు అనుమతినిచ్చారని ఆరోపిస్తూ
సామాజిక కార్యకర్త అబ్రహం టి జోసెఫ్ దాఖలు చేసిన ప్రయివేట్ పిటిషన్‌ను
విచారించిన లోకాయుక్త కోర్టు న్యాయమూర్తి ఎన్ కె సుధీంద్రరావు కేసు నమోదు
చేయాలని లోకాయుక్త ఎడిజిపిని ఆదేశించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి
2012 జనవరి ఆరో తేదీలోపు నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
మాజీ ముఖ్యమంత్రులతో పాటు పది మంది బ్యూరోక్రాట్లకు ఈ అక్రమ మైనింగ్‌తో
సంబంధం ఉందని అబ్రహం టి జోసెఫ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల
ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని అబ్రహం ఆరోపించారు.
కృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో (1999 - 2004) కేవలం పాత ధరలకే మైనింగ్
లీజుకు అనుమతినిచ్చారని పిటిషనర్ ఆరోపించారు. అంతటితో ఆగక అటవీ, పర్యావరణ
శాఖ అధికారుల అభ్యంతరాలను కూడా తోసిరాజని కృష్ణ, రిజర్వు ఫారెస్ట్
భూముల్లోనూ లీజుకు అనుమతినిచ్చారన్నారు. ఇక 2005లో ముఖ్యమంత్రిగా ఉన్న
ధరంసింగ్ వ్యవసాయ భూముల నుంచి ఇనుప ఖనిజం, ముడి మాంగనీస్‌ల రవాణాకు
తాత్కాలిక అనుమతినిచ్చారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.23.22 కోట్ల
నష్టం వాటిల్లిందన్నారు. తర్వాత 2006-07 మధ్య సిఎంగా ఉన్న కుమారస్వామి,
సాయి వెంకటేశ్వర మినరల్స్ మైనింగ్ లైసెన్సును ఆమోదించి, జంతాకల్
ఎంటర్‌ప్రైజెస్ లైసెన్సును పునరుద్ధరించారని అబ్రహం తెలిపారు. ఇటీవల
కర్నాటక లోకాయుక్తగా పనిచేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే ప్రభుత్వానికి
సమర్పించిన నివేదిక ఆధారంగా అబ్రహం ఈ పిటిషన్ దాఖలు చేశారు.