'ఒక ఫోటోను కాల్చివేశాక, ఆ నుసిని కాఫీలో
వేసుకుని తాగేస్తే ఏమవుతుంది? కడుపు నొప్పి వస్తుందా? ప్రాణాపాయం
ఏర్పడుతుందా?, ఇలాంటి ఆలోచనలు ఆ సీన్లో నటించిన తారలకు రాలేదంటే
ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ సన్నివేశం సూపర్‌హిట్ చిత్రం 'మరో చరిత్ర'
లోనిదని, అందులో హీరోయిన్ తల్లి కోపంతో హీరో ఫోటో కాల్చివేస్తే, ఆ నుసిని
అలాగే నాయికా కాఫీతోపాటు తాగేస్తుందనీ ఆ చిత్రం చూసిన చాలామందికి గుర్తుండే
ఉంటుంది. తెలుగు వెర్షన్‌లో సరిత నటిస్తే, హిందీ (ఏక్ దూజే కేలియే)లో రతి
అగ్నిహోత్రి నటించారు. దర్శకులు కె. బాలచందర్ ఆ సన్నివేశం
తీస్తున్నప్పుడు - రెండు వేర్వేరు దృశ్యాలుగా తీసి కలపలేదు. ఫోటోను
కాల్చడం, కాఫీ కప్పులో ఫోటో కాలిన నుసి వేయగానే, నాయిక అలాగే తాగడం - అన్నీ
వరసగా తెరమీద కనబడగానే ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురవుతారు. ఆ సంగతి
ఇటీవలే రతి అగ్నిహోత్రి గుర్తుకు తెచ్చుకుంటూ ''హిందీ వెర్షన్ 1979లో
ఆరంభించారు. అప్పుడు నా వయసు 16. తెలుగు విశాఖపట్నంలో తీస్తే, హిందీ చిత్రం
షూటింగ్ గోవాలో జరిగింది. అప్పుడు నాకు ప్రేమా దోమా, పెద్దలను ఎదరించడాలు
వంటివేవీ తెలియదు. డైరెక్టరు ఎలా చెబితే అలా ఉత్సాహంగా చేయాలన్నదే నా
ధ్యేయం. గోవాలో మండుటెండలో ఇసుక మీద పడుకుని ఉంటే, కమలహాసన్ నా పొట్టమీద
బొంగరాన్ని తిప్పుతారు. ఒకపక్క ఒళ్లు కాలిపోతుంటే, చిలిపిగా
'ఎక్స్‌ప్రెషన్స్' ఇవ్వాలి. అలాగే - ఫోటో కాల్చిన సీన్. కాఫీలో కలిపి
తాగమంటే అలాగే తాగేశాను కానీ ఆ తర్వాత ఏమవుతుందో అసలు ఆలోచించనే లేదు.
లక్కీగా ఏమీ కాలేదనుకోండి... ఏమైనా ఆ సినిమాలో నటించడం ఓ స్వీట్
ఎక్స్‌పీరియన్స్'' అంటారు రతి.