8, నవంబర్ 2010, సోమవారం

ప్రభుత్వానికే పంగనామాలు పెడుతున్నా పట్టించు కోరా ?

ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వివిధ శాఖలు ప్రతి ఏడాది ఆదాయ మార్గాలను వృద్ధిపరచుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఏ ఏడాదికి ఆ ఏడాది ఆదాయంలో పెరుగుదలను చూపిస్తాయి. ఇలా పలు శాఖల నుంచి వచ్చిన ఆదాయాన్ని క్రోడీకరించి రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేస్తారు.అయితే డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కార్యాలయాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరి స్తున్నట్లు ఆరోపణలు వస్తునా ప్రభుత్వానికి పట్టదు.

ఇటీవల కాలంలో రాష్ట్రంలో వాహనాలు, ఇతర వాహనాల కొనుగోళ్లు ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నా... వీటి ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజు, లైఫ్‌ టాక్స్‌ వంటి రాబడులు రవాణా కార్యాలయానికి చేరాల్సి ఉంది. అదేవిధంగా ప్రతిఏటా ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు, లారీలు వంటి వాహనాల రెన్యువల్స్‌ సందర్భంగా కూడా ఆదాయం వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే పలు ప్రాంతాల్లో వాహన తనిఖీ సమయంలో వచ్చే ఆదాయానికి లెక్క ఉండదు.

నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ ఎత్తున జరిమానాలు విధించాల్సి ఉన్నా .. జరిమానాలు విధించి అధిక మొత్తాన్ని ఆమ్యామ్యాల రూపంలో నొక్కేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొందరు ఏకంగా నకిలీ చలానా పుస్తకాలు ఉపయోగించి బినామీ రసీదుల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముకు కూడా పంగనామాలు పెట్టి అడ్డదారిలో స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

రాత్రి సమయాల్లో జరిగే తనిఖీల్లో ఇటువంటి మతలబు వ్యవహారాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని సమాచారం. ఈ కారణంగా అక్రమ రవాణా పెచ్చుమీరుతుండగా ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా నిఘా విభాగాలు రవాణా కార్యాలయాల కలాపాలపై కన్ను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది