8, నవంబర్ 2010, సోమవారం

పల్లెబాట పొడగించిన టిఆర్‌ఎస్

ఇతర పార్టీల నుండి వలసలను ప్రొత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన పల్లెబాట కార్యక్రమాన్ని టిఆర్‌ఎస్ పొడగించింది. గత నెల 21 నుండి ఈ నెల 4వ తేదీ వరకు సాగుతుందని తొలుత ప్రకటించినా ఇతర పార్టీ కార్యకర్తలు, నేతలు నుండి అనూహ్య స్పందన లభించడంతో పల్లెబాట కార్యక్రమాన్ని 14వ తేదీ వరకు పొడగించింది.

గతంలో కార్యకర్తలు టి ఆర్ ఎస్‌లో చేరాలంటే కేవలం తెలంగాణ భవన్‌కు వెళ్లి మాత్రమే పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చేది. అయితే స్వయంగా టి ఆర్ ఎస్ పార్టీ నేతల నుండి, కార్యకర్తల నుండి, ఇతర తెలంగాణ వాదుల నుండి వస్తున్న విమర్శలను తొలగించడానికి స్వయంగా కెసి ఆర్ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ అన్ని పార్టీల వారికీ ఆహ్వానాలు పంపిస్తున్నారు. కెసిఆర్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం, కాంగ్రెస్ , పిఆర్‌పి పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

మరో వైపు ఆ పార్టీ మహిళ నేత మెదక్ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి కూడా జిల్లాలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇతర పార్టీల నుండి శ్రేణులను ఉత్సాహపరిచి పార్టీలో చేర్చుకోవడానికి గతంలో తనకు బిజెపి పార్టీతో నెలకొన్న సంబంధాలను ఉపయోగించి తీవ్రతరం చేస్తున్నారు. మొత్తంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలోపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని ఏదొక విధంగా బలోపితం చేయాలిన పార్టీల నేతలు భావిస్తున్నారు.