రాయలసీమ ప్రాంత ప్రజల సంక్షేమం, సీమేతరుల దాడుల నుంచి కాపాడుకోవాడానికే గ్రేటర్ రాయలసీమ సైనిక సేవా దళ్‌ను ఏర్పాటు చేశామని రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్, కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.
రాయలసీమ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి క్షేమాన్ని కోరుతూ సైనిక సేవా దళ్ ముందుకు పోతుందని.. క్రమశిక్షణ, సేవా భావం దళ్ సభ్యులు ప్రధానంగా ఆచరిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల అభిమానం, ఆశీస్సులతో వారికి సేవలందిస్తూ రక్షణ కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రాయలసీమ వాసులు సమైఖ్య రాష్ట్రం కోసం రాజధానిని త్యాగం చేశారని .... కృష్ణా జలాల పంపకంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినా ఇంత వరకు అమలుకాలేదని అన్నారు. రాయలసీమకు చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రులు అయిన సీమ లబ్ధి పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన పివి నరసింహారావు రాయలసీమ నుండి లోక్‌సభకు ఎన్నికై ప్రధానమంత్రి అయ్యారన్న విషయాన్ని తెలంగాణ వాసులు గుర్తుచేసుకోవాలని టీజీ వెంకటేష్ అన్నారు.