26, ఫిబ్రవరి 2011, శనివారం

సోనియా మౌనరాగం ... మన్మోహన్‌ ప్రేక్షకపాత్ర ...

తెలంగాణ అంశం పల్లె నుండి ఢిల్లీ చేరింది. జరగాల్సింది అదే. గతంలో కూడా అనేకసార్లు ఆ విధంగా జరిగింది. అయితే, ఢిల్లీ పెద్దలు సమస్యను సత్వరంగా పరిష్కరించలేకపోగా, తెలంగాణ నేతలను, ప్రజలను సంయమనం పాటించాలని కోరుతున్నారు. సోనియాగాంధీ మౌనరాగాన్ని అర్థం చేసుకున్న ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌ సాక్షిగా ప్రేక్షకపాత్ర వహించగా, కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులు, వీరప్ప మొయిలీ, ప్రణబ్‌ ముఖర్జీలు మాత్రం తమదైన శైలిలో స్పందించారు. మొన్నటి లోక్‌సభ సమావేశాల్లో మొదటిరోజు రాష్ట్రపతి ప్రసంగం అయిన వెంటనే కాంగ్రెస్‌ ఎం.పి.లు ''తెలంగాణ కావాలి, సోనియా గాంధీ జిందాబాద్‌'' అనే నినాదాల ప్లకార్డులు ప్రదర్శించి తమ ద్విపాత్రాభినయం చేశారు. రెండవ రోజు, ఢిల్లీ చేరుకున్న కెసిఆర్‌, విజయశాంతిలు వాయిదా తీర్మానం కోసం పట్టుపడుతుండగా, కాంగ్రెస్‌ ఎం.పి.లు తమ సీట్లలో కూర్చొని 'జిందాబాద్‌'లకు పరిమితమైనారు. స్పీకర్‌ మాటలను నమ్మిన కెసిఆర్‌ కూడా తన కార్యక్రమాన్ని మూడో రోజుకు వాయిదా వేసుకున్నాడు. తీరా మూడో రోజు వచ్చేసరికి, వాయిదా తీర్మానం బదులు శూన్యకాలం (జీరో అవర్‌) లోనే తెలంగాణ అంశం ప్రస్తావించాలని స్పీకర్‌ చెప్పడంతో, గత్యంతరం లేని పరిస్థితిలో కెసిఆర్‌ తదితరులు పోడియం వద్దకు వెళ్ళే ప్రయత్నం చేయగా, సభను మూడుసార్లు వాయిదా వేశారు. ఆ సందర్భంలో కాంగ్రెస్‌ ఎం.పి.లు తమ స్థానాలను అట్టిపెట్టుకుని 'జిందాబాద్‌' నినాదాలను కొనసాగించారు. తెలంగాణ తెలుగుదేశం ఎం.పీల్లో ఒకరు మౌనంగా ఉండగా, మరొకరు జిందాబాద్‌ అంటూ నవ్వులపాలైనారు. బి.జె.పి. నేత సుష్మా స్వరాజ్‌ చొరవ, తెలంగాణ పట్ల ఆమె ప్రస్తావన నాటి సభికుల కళ్ళు తెరిపించినట్లయింది. సందర్భోచితంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టటమే కాకుండా తెలంగాణ డిమాండ్‌ న్యాయబద్ధతను ఢిల్లీ పెద్దలు గుర్తించేలా ఉన్నాయి!

ప్రతి అంశం రాజకీయం చేసి, ఎన్నికల్లో ప్రయోజనాలు ఎలా పొందాలని ఎత్తుగడలేసే అన్ని పార్టీల నేతలు, సహజంగా తెలంగాణ లాంటి కీలక అంశాన్ని నిజాయితీగా పరిష్కరిస్తామని అనుకోలేము. అందుకే, దశాబ్దాల తరబడి కాలయాపన చేసి ఎవరు అధికారంలో ఉన్నా, సమస్యను మరింత సంక్లిష్టం చేయడమే గాని ఇంతవరకు పరిష్కరించలేదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు మాత్రం, వీరోచిత పోరాటాలకైనా, ప్రకటనలకైనా సిద్ధం అన్నట్లు వ్యవహరిస్తారు. దాదాపు అన్ని పార్టీలు, వారి మిత్రపక్షాలు తెలంగాణ సమస్యను నాన్చటంలో ప్రధాన భూమిక పోషించాయి. అందుకే, నేడు తెలంగాణ అగ్నిదావానలంలా అన్ని పార్టీలకు అంటుకుని ఉంది. రాష్ట్రం మొత్తం (తెలంగాణతర ప్రాంతాలు కూడా) ఈ తెలంగాణ సెగతో ఉడికిపోతోంది. దశాబ్దాల పోరాటం సరే, గత ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ ప్రకంపనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు అచేతనంగా ఉన్నాయి. విద్యావ్యవస్థ కుప్పకూలింది. ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తుండగా ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తమైంది. సగటు పౌరులు, అన్ని ప్రాంతాల వారు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రత్యేకించి, రోడ్డు రవాణా పరిస్థితులు అతలాకుతలమైనాయి. అయినా, ఆమాత్యులు మాత్రం తమ పాలన సాఫీగా జరుగుతున్న భ్రమల్లో ఉన్నారు. సహజంగా, సగటు ప్రజలు బేజారైనట్టి భావన వుంది. ఎంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే అంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమొచ్చినా ఫర్వాలేదని సీమాంధ్ర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే, సుహృద్భావ వాతావరణంలో రాష్ట్ర విభజన జరగాలే కాని, అంతర్యుద్ధ పరిస్థితులు తెచ్చి పెట్టవద్దని రాజకీయ పార్టీలను కోరుతున్నారు.

మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వానిదైంది. 2004 ఎన్నికలనాడు తెరాసతో పొత్తు పెట్టుకుని, తెలంగాణకు సానుకూలంగా చెప్పి, అధికారంలోకి వచ్చి, మొండిచెయ్యి చూపాలనుకుంటే, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ వారికి చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి ఎదురైంది. వైఎస్‌ఆర్‌ మరణంతో, దాదాపు చావు పరిస్థితే కాంగ్రెస్‌ ఎదుర్కోవలసి వస్తుంది. కనీసం తెలంగాణను తక్షణమే పరిష్కరించినా నేడా పద్మవ్యూహ పరిస్థితి ఉండకపోయేది కాదు. మొదట్లోనే కెసిఆర్‌ను విశ్వాసంలోకి తీసుకొని, రాష్ట్ర సాధనకొక కాలపరిమితిని ప్రకటించి ఉండాల్సింది. డిసెంబర్‌ 9, 2009 నాటి చిదంబరం ప్రకటననుసారం తెలంగాణ ప్రక్రియ కొనసాగవలసింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు స్పష్టంగా ప్రకటించాల్సి వుండేది. కాలయాపన జరిగినా సరే శ్రీకృష్ణ కమిటి సిఫార్సులు పరోక్షంగానైనా తెలంగాణకు అనుకూలంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సింది. కమిటీ సిఫార్సులు నెలలు గడిచినా ఇంకా కేంద్ర విధానం అస్పష్టంగా ఉండడం వల్ల నేడా పద్మవ్యూహం ఎదురౌతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ప్రజలు, పార్టీల కతీతంగా ఉద్యమబాట పట్టారు. ఉధృతం చేస్తున్నారు. ఇంకెంత కాలయాపన చేస్తే, ఆ మేరకు కాంగ్రెస్‌ ఎలాగు నష్టపోతుంది. యావత్‌ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. కేవలం రెండు రోజుల తెలంగాణ బంద్‌నే చూశాము. వారం రోజుల బంద్‌ ప్రకటిస్తే ఏమవుతుందో ఆలోచించాలి. రాజధాని హైదరాబాద్‌ తెలంగాణలో ఉన్నందున, యావత్‌ రాష్ట్ర పరిపాలన కుంటుపడుతుంది. కనీసం తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు కూడా దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటి ప్రభావం చివరికి తెలుగువారి మధ్య మానసిక దాడులతో పాటు, భౌతిక దాడులు జరిగే దుస్థితికి కారణమవుతుంది.

ఈ నేపథ్యంలో పరిశీలిస్తే, సత్వరమే తెలంగాణ ప్రకటనతో పాటు పార్లమెంటరీ ప్రక్రియ కొనసాగిస్తే, కాంగ్రెస్‌ గట్టెక్కవచ్చు. పద్మవ్యూహం నుండి బయటపడవచ్చు. కాదంటే, ప్రతిపక్ష బి.జె.పి.తో బిఎస్‌పి లాంటి ఇతర పక్షాలు, తెలంగాణాలో అనుకూలంగా తీర్మానించాయి. సభలో గట్టిగా నిలబడ్డాయి. అటువంటప్పుడు, 2జి స్పెక్ట్రం కుంభకోణంపై జెపిసిని వేయటానికి వెనుకంజవేసి ఇంతకాలం పరాభవం పాలైన కాంగ్రెస్‌ మాదిరిగా, తెలంగాణ విషయంలో కాలాతీతమౌతోంది. ఇటు రాష్ట్రంలో, తెలంగాణలో, బయటా కాంగ్రెస్‌ పరపతి దిన దినగండంగా మారుతోంది. ఈ తెలంగాణ పోరాటాలు ఇంత కంటె తీవ్రరూపం దాల్చి, కాంగ్రెస్‌ను అధోగతి పాలు చేస్తాయి. పరిస్థితి విషమిస్తే, మరో రెండేళ్ళు ఆగటానికైనా తెలంగాణ వాదులు సిద్ధపడి, బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడటానికి సాయపడవచ్చు. ఆ దిశలో కెసిఆర్‌ తదితరులు ప్రయత్నిస్తున్న సంకేతాలొస్తున్నాయి. అటువంటప్పుడే, కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన దుస్థితి కెసిఆర్‌కి కూడదు. తెరాసనే బలోపేతం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కెసిఆర్‌ చక్రం తిప్పవచ్చు. కేవలం తెలంగాణ కోసం, కాంగ్రెస్‌ చెప్పినట్లు నడుచుకోటానికి కెసిఆర్‌ సిద్ధంగా లేడిప్పుడు. కుప్పిగంతులు వేయదు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పటానికి బి.జె.పి.తో, టిడిపితో జట్టు కట్టడానికైనా ఆయన వెనుకాడడని అర్థం చేసుకోవాలి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కెసిఆర్‌ వ్యూహాలను తెలంగాణ ప్రజలు సమర్థించాల్సి వస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రం వాయిదా పడి కెసిఆర్‌ రాజకీయాలు గెలుస్తాయి. కాంగ్రెస్‌ బదులు బి.జె.పి. అధికారంలోకి వచ్చినంత మాత్రాన తెలంగాణ వస్తుందా అనే ప్రశ్న ఎలాగున్నా, కుక్కకాటుకు చెప్పుదెబ్బ అవసరమని తెలంగాణ ప్రజలు భావిస్తారు. అందుకే ఆలస్యం వల్ల అమృతం విషమవుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి!

డా కె.విద్యాసాగర్‌ రెడ్డి