26, ఫిబ్రవరి 2011, శనివారం

వివాహానికీ ఉంది బీమా

భారత్‌లో గత సంవత్సరం జరిగిన వివాహ వేడుకల ఖర్చు 1.9 నుంచి 2.25 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. మీ జీవితంలో దాచి వుంచుకున్న డబ్బులో అత్యధిక భాగం పెళ్ళికి వెచ్చించాలని భావిస్తుంటే మాత్రం ఖచ్చితంగా సెక్యూరిటీని కోరుకుంటారు. మీ డబ్బకు భద్రత కల్పించేందుకు, దురదృష్టకర సంఘటనలు జరిగితే మీకు కలిగిన నష్టానికి పరిహారం అందుతుంది.

చాలా కంపెనీలు ప్రస్తుతం ఈవెంట్‌ ఇన్స్యూరెన్స్‌లో భాగంగా పెళ్ళిళ్లకు బీమా చేస్తున్నాయి. ఈ పాలసీ ప్రధానంగా ప్రమాదం, వివాహం రద్దు లేదా వాయిదా, పెళ్ళి మండపంలో అద్దె వస్తువులకు జరిగే నష్టంలపై కవరేజ్‌ను ఇస్తున్నాయి. ఇదే సమయంలో ఈ పాలసీలను ఎవరికి తగ్గట్టుగా వారు మలచుకోవచ్చు. ఉదాహరణకు ఫుడ్‌ పాయిజనింగ్‌ జరగడం, పవర్‌ ఫెయిల్యూర్‌, భారీ వర్షాలతో కార్యక్రమం రసాభాస కావడం తదితర రైడర్లను ఎంపిక చేసుకోవచ్చు.

దీంతో పాటు ఆభరణాల దొందతనం, సమయానికి పెళ్ళి కొడుకు లేదా పెళ్ళి కూతురు మండపానికి చేరుకోలేక పెళ్ళి వాయిదా పడడం వంటి సంఘటనలకు బీమా ఉంది. ఒకవేళ ఉగ్రవాదుల దాడి జరిగితే... అందుకూ బీమా కవరేజ్‌ లభిస్తుంది.

కవరేజ్‌లోకి రానివి: ఒకవేళ ఇరు వర్గాల మధ్యా మనస్పర్ధలు వచ్చి వివాహం రద్దయితే, బీమా ఉండదు. అయితే, కొన్ని సంస్థలు మాత్రం కట్నం విషయంలో తేడా వచ్చి పెళ్ళి ఆగితే బీమా అందిస్తున్నాయి. పార్టీల అజాగ్రత్తే నష్టానికి కారణమని తేలితే బీమా కంపెనీలు క్లయిమ్‌ చెల్లింపులకు ముందుకు రావు. చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే బీమా కంపెనీ అందించే నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదివి పూర్తిగా అర్ధం చేసుకోవాలి.

ప్రీమియం ఎలా..: బజాజ్‌ అలయన్స్‌ 20 లక్షలు, 35 లక్షలు, 58 లక్షలు, 73 లక్షలు ఇలా వివిధ రకాలుగా వివాహ బీమాను అందిస్తోంది. వీటికి వరుసగా 2,252, 4,004, 6,232, 8,273 రూపాయల ప్రీమియంను (సేవా పన్ను కలుపుకొని) చెల్లించాల్సి వుంటుంది.