‘ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అడుగుపెడుతారా? అని కొంతమంది ఆంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు, వారికి ఇదే మా సమాధానం, కచ్చితంగా సభకు వస్తాం, తెలంగాణసత్తా చాటుతాం, వచ్చే సమావేశాల నాటికి దానిని తెలంగాణ రాష్ట్ర శాసనసభగా మార్చుకుంటాం’ అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె తారకరామారావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం తామే సాధించి తీరుతామని ప్రగల్భాలు పలుకుతోన్న కాంగ్రెస్ నేతలు ఒక విషయాన్ని గ్రహించాలి, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది, కెసిఆర్ దీక్షవల్లనే తప్ప, ఇందులో కాంగ్రెస్ నేతల వల్ల కాదని ఆయన కెటిఆర్ గుర్తు చేశారు. డిసెంబర్ తర్వాత మరోసారి తెలంగాణ సమాజమంతా ఏకమై కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమకారుల్ని అతి క్రూరంగా కాల్చిచంపించిన కాసు బ్రహ్మానందరెడ్డి వంటి వారి విగ్రహాలు తమకు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రనేతల విగ్రహాలపై చీమ వాలితే కూడా స్పందించే చంద్రబాబుకు, తెలంగాణ రాష్ట్రం కోసం వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.