అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 22 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటీష్ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో దూసుకోపోతున్న మాస్టర్ బ్లాస్టర్‌ను "నవయుగ బ్రాడ్‌మన్"గా అభివర్ణించింది.
టెస్టు క్రికెట్‌లో శతకాల 'అర్ధ సెంచరీ'కి అడుగు దూరంలోనే ఉన్న సచిన్, కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ రికార్డును అధిగమిస్తాడని బ్రిటన్‌కు చెందిన 'ది టైమ్స్' పత్రిక వెల్లడించింది. ది టైమ్స్ పత్రిక రాసిన ఓ కాలమ్‌లో ప్రముఖ క్రీడా విశ్లేషకుడు జాన్ వుడ్‌కాక్ సచిన్‌ను నేటి కాలపు బ్రాడ్‌మన్‌గా కొనియాడాడు. సచిన్ ఆడినన్ని ఇన్నింగ్స్ బ్రాడ్‌మన్ ఆడుంటే మాత్రం శతకాల సంఖ్య 100కు చేరేదని వుడ్‌కాక్ చెప్పాడు. ప్రస్తుతం బ్రాడ్‌మన్ కనుక ఉండివుంటే.. సచిన్ తరహా ఆటతీరుతో యావత్తు క్రికెట్ అభిమానులను అలరించేవాడని వుడ్‌కాక్ చెప్పాడు.