11, డిసెంబర్ 2011, ఆదివారం

సోనియా జన్మదిన కానుకగా మద్యం

యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ జన్మదిన కానుకగా రాష్ట్ర ప్రభుత్వం 171 లక్షల లీటర్ల మద్యం ఉత్పత్తి పెంచేందుకు వీలుగా ఉత్తర్వులిచ్చే ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేసి మహిళలను అవమానపరచారని తెలుగుదేశం పార్టీ దుయ్యబట్టింది. సోనియా బర్త్‌డేకు మహిళలకు ఇచ్చే కానుక ఇదేనా, ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన అసమర్థకు అద్దం పడుతుందని ఆ పార్టీ మండిపడింది. ఆర్ధిక లావాదేవిలకు సంబంధించిన అన్ని ఫైళ్ళలో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని, అలాంటి ఫైళ్ళకు ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపుతుందని శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యుడు యలమంచలి బాబూ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని వంద నుంచి 200 రోజులకు పెంచుతామంటూ ముఖ్యమంత్రి హామీ ఇస్తూ పేదలను వంచిస్తున్నారని తెలుగుదేశం నాయకులు దుయ్యబట్టారు. వందరోజుల పని చూపించలేకపోవడమే గాక చేసిన పనులకు వేతనం కూడా చెల్లించడం లేదని వారు ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నిధులు కాంగ్రెస్‌ పైరవీకారులు దోచు కుంటున్నారని, సోషల్‌ ఆడిట్‌లో కూడా నిధుల దుర్వినియోగం బయటపడిందని వారు చెప్పారు. కాంగ్రెస్‌ నేతల బొజ్జలు నింపేందుకే ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారని, పేదల సొమ్ము దోచుకుంటున్నారని వారు ధ్వజమెత్తారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్‌లు ఉపాధి హామీ పథకం నిధులను తమ సొంత ఎస్టేట్‌లకు రోడ్లు వేయించుకునేందుకు దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. రాజీవ్‌ యువకిరణాలు పేరుతో మరోసారి యువతను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వస్తుందని వారు దుయ్యబట్టారు. గతంలో రాజీవ్‌గాంధీ పేరుమీద అనేక పథకాలు ప్రకటించి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకపోగా పాతవాటిని కొత్తవిగా చెప్పుకుంటూ యువతను మభ్యపెడుతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామంటూ ఆర్బాట ప్రచారాలతో డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి సభలకు రప్పిస్తున్నారని వారు చెప్పారు. డ్వాక్రా మహిళలు తమ సమస్యలను లేవనెత్తితే ముఖ్యమంత్రి వాటిని వినకుండా డ్రాప్‌బాక్స్‌లో వేయాలంటూ చెబుతున్నారని, ప్రభుత్వ హామీలకు, చేతలకు ఏ మాత్రం పొంతన లేదని వారు దుయ్యబట్టారు.