11, డిసెంబర్ 2011, ఆదివారం

పాత పథకాలకు కొత్త లేబుళ్లు

ముఖ్యమంత్రిగా ఏడాది పరిపాలన పూర్తి చేసుకొన్న కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రయాణం నల్లేరుమీద బండిలా సాఫీగా సాగిపోతున్నదన్న భావన చాలామందిలో ఉంది. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల అధినేతలపై హైకోర్టుల్లో నడుస్తున్న కేసుల వల్ల... వారేదో సమస్యల్లో కూరుకొని ఉండగా... తను మాత్రం కొత్త కొత్త పథకాలు ప్రకటించుకుపోతూ ధీమాగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కన్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు చాలావరకు పరిస్థితులు అనుకూలించి... రాష్ట్ర ప్రధాన సమస్యలు తాత్కాలికంగా వెనక్కుపోయాయి. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె, ఆ తర్వాత గాలి జనార్థనరెడ్డి అరెస్ట్‌, వైయస్సార్‌ పార్టీ అధినేత జగన్‌పై అక్రమాస్తుల కేసు దర్యాప్తు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వై.ఎస్‌. విజయ దాఖలు చేసిన అఫిడవిట్‌పై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం... అసెంబ్లీ సమావేశాల రభస, అవిశ్వాస తీర్మానం .. తదితర పరిణామాలు మీడియా పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. మధ్యలో పార్లమెంట్‌ సమావేశాలు, ఎఫ్‌డిఐపై విపక్షాల రగడ మొదలైన అంశాలు ప్రజల దృష్టిని అటువైపు మళ్లించేలా చేశాయి.
కారణాలు ఏవైనా కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఓ ఏడాది కాలం సజావుగా సాగిపోయుండచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. నిజం చెప్పాలంటే... ఆయనకిది ఎంతో గడ్డుకాలం... రానున్న నాలుగైదు నెలలు మరింత క్లిష్ట సమయం. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగి ఉంటే కిరణ్‌ కష్టాలు ప్రజలకు తెలిసేవి. కానీ... ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా లేవనెత్తిన అంశాలకు, చేసిన ఆరోపణలకు కిరణ్‌కుమార్‌ రెడ్డి సమాధానం ఇవ్వకుండా తాను చెప్పదలచుకున్నదేదో చెప్పేసి సరిపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావులు తెలంగాణాపై అనర్గళంగా, ఆవేదనతో మాట్లాడిన అంశాలలో ఏ ఒక్కదానికీ బదులు ఇవ్వకుండా 'తెలంగాణ అంశం కేంద్రం పరిధిలోనిది' అనే ఏకవాక్య సమాధానంతో సరిపెట్టారు.
అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికపై చర్చ జరిగి ఉంటే ప్రభుత్వం ఇరుకునపడేది. కాగ్‌ నివేదికలో ప్రభుత్వ వైఫల్యాలెన్నో కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్వరూపాన్ని కాగ్‌ ఎండగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకొనే లక్ష కోట్లు దాటిన బడ్జెట్‌ డొల్లతనాన్ని ఎత్తిచూపింది. 2009 -10 ఆర్థిక సంవత్సరంలో లక్షా 11 వేల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌ చివరికొచ్చేసరికి 87 వేల కోట్ల రూపాయలు దాటలేకపోయిన వైనాన్ని 'కాగ్‌' చూపింది. కాగ్‌ నివేదికలో ఇంకా అనేక చేదు నిజాలు వెల్లడయ్యాయి. జలయజ్ఞం చతికిలపడిన తీరుతెన్నులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భారీగా పెరిగిన అంచనాలు, అధిక చెల్లింపులు, నాణ్యతా లోపాలు, కేంద్రం నుంచి అందిన నిధులకు లెక్కలు లేకపోవడం, మద్యం అమ్మకాలు పెరుగుతున్న తీరు లాంటి ఎన్నో లోపాల్ని 'కాగ్‌' బహిర్గతం చేసింది.
'కాగ్‌' నివేదికపై ప్రతిపక్షాలు విమర్శించినా ప్రభుత్వం నోరు మెదపలేదు. మెజారిటీ ప్రజలకు గణాంకాలు అక్కర్లేదు కనుక ప్రభుత్వానికి 'కాగ్‌' వల్ల కలిగిన తలనొప్పులు లేకపోవచ్చు. కానీ... ప్రజలు ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యలు కిరణ్‌కుమార్‌ రెడ్డిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసే క్షణాలు సమీపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకొనే డిసెంబర్‌ నెలలోనే విద్యుత్‌ కొరత ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. గత 15 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చూడని విద్యుత్‌ సంక్షోభం రాష్ట్రంలో నెలకొని ఉంది. తమకు సక్రమంగా విద్యుత్‌ సరఫరా జరుగుతున్నదా? లేదా? అన్న అంశాన్నే ప్రజలు పరిగణనలోకి తీసుకొంటారు తప్ప కొరతకు ప్రభుత్వం చెప్పే కారణాలను విశ్వసించరు. వాటిని సాకులుగానే చూస్తారు. విద్యుత్‌ కోతల వల్ల రాష్ట్ర పారిశ్రామిక రంగం రూ.12,000 కోట్ల మేర నష్టపోయినట్లు ఫ్యాప్సీ వెల్లడించింది. వారానికి రెండు రోజులపాటు కరెంట్‌ లేకపోతే పరిశ్రమలు ఏం సాధిస్తాయి? ఉత్పత్తిని కుదించుకొన్న పరిశ్రమలు వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. శీతాకాలంలోనే విద్యుత్‌ కొరత నెలల తరబడి ఉంటే మండువేసవిలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించడానికి కూడా భయం వేస్తుంది. గృహావసరాలకు సరఫరా చేసే విద్యుత్‌లో గ్రామాలకు, మండల కేంద్రాలకు 8 నుంచి 12 గంటలు; నగరాలకు 6 గంటలు కోత కోస్తుంటే ఈ వేసవిలో విద్యుత్‌ సరఫరా ఎలా ఉండబోతోంది? రబీలో వేసే పంటలు సక్రమంగా చేతికొస్తాయా? అన్నది అనుమానమే. ఇప్పటికే కరెంట్‌ కోతలను నిరసిస్తూ వివిధ ప్రాంతాలలో రైతులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను ముట్టడిస్తున్నారన్న వార్తలొస్తున్నాయి. కళ్లముందే పంటలు ఎండుతున్న దృశ్యాలను చూసి రైతాంగం నిర్లిప్తంగా ఎలా ఉండగలదు?
ప్రజా సమస్యలెలా ఉన్నా కొత్త పథకాలు ప్రకటించడంపైనే కిరణ్‌కుమార్‌ రెడ్డి ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆయనకు తెలిసి చేస్తున్నారో లేక అధికారులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియదుగానీ... పాత పథకాలకే కొత్త ముసుగులు తొడిగి వాటినే కొత్త పథకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో మౌలిక సదుపాయల కల్పన అంటూ కొత్త పథకాన్ని ప్రారంభించారు. నిజానికిది 2005లో డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆదర్శ గ్రామాలు అనే కాన్సెప్ట్‌ తెచ్చారు. ప్రతి రెండేళ్లకు 1/3 వంతు ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పరిచి 2011 నాటికల్లా అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. 2011 పూర్తికావస్తున్న తరుణంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇప్పుడా పథకం చేపట్టి కొత్తదిగా చెపుతున్నారు. మీసేవ, రాజీవ్‌ యువకిరణాలు, స్త్రీశక్తి... ఇవన్నీ కొత్త లేబుల్స్‌తో వచ్చిన పాత పథకాలే. ఇది కిరణ్‌మార్కు జిమ్మిక్కు... ఇలాంటి జిమ్మిక్కులతో ముఖ్యమంత్రి ప్రజల మన్ననలు పొందగలరా?