11, డిసెంబర్ 2011, ఆదివారం

వారిపై అనర్హత వేటు తప్పదు...

పార్టీ విప్‌ను ధిక్కరించి అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జగన్‌ వర్గం ఎమ్మెల్యేలపై రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు కింద అనర్హత వేటు వేయాల్సిందిగా శాసనసభ స్పీకర్‌కు దరఖాస్తు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌లతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణ అంశంపై శనివారం విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం హైద్రాబాద్‌ తిరిగివెళ్లే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారిపై అనర్హత వేటు తప్పదని, అయితే, విప్‌ పాటించకపోయినా ఓటింగ్‌కు గైరుహాజరైన వారి నుంచి వివరణ మాత్రం కోరుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం ఇక్కడికి తిరిగి రాగానే రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ నివాసానికి వెళ్లి ఆయనతో దాదాపు గంటకుపైగా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత గులాంనబీ ఆజాద్‌, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌, సోనియాతో సమావేశమైనప్పుడే అధ్యక్షురాలి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రికి కూడా పిలుపు వచ్చింది. దీనితో ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి ముగ్గురూ సోనియా గాంధీతో గంటన్నరకు పైగా రాష్ట్ర వ్యవహారాలను చర్చించారు. సోనియాతో సమావేశానంతరం ముఖ్యమంత్రి మరోసారి గులాంనబీ ఆజాద్‌ నివాసానికి వెళ్లి చర్చలు కొనసాగించడం విశేషం.
అధిష్టానంతో జరిపిన చర్చల వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన ఆయన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేసిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం రాష్ట్రానికి తిరిగివెళ్లిన తర్వాత సీనియర్‌ మంత్రులు, పిసిసి అధ్యక్షునితో కూడా సంప్రదించి అతి త్వరలోనే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ 2 (1) (బి) సెక్షన్‌ కింద వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ద్వారా స్పీకర్‌ను కోరనున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు విషయం తనకేమీ తెలియదని, పత్రికలు, టివి చానళ్లలోనే చూస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ తరఫున ఎన్నికైన వారు అదే పార్టీలో కొనసాగాలనే రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటున్నదని, ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్య తీసుకొనేందుకే పదవ షెడ్యూల్‌ను పొందుపరచినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
అసెంబ్లీలో బలపరీక్షకు ముందు జగన్‌ వర్గం ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపి ప్రలోభపరిచే ప్రయత్నాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 'వారంతా కాంగ్రెస్‌ శాసనసభ్యులే, స్వంత పార్టీ ఎమ్మెల్యేలకే లంచం ఇవ్వాల్సిరావడమంటే అంతకంటే దురదృష్టం మరోటి ఉండదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచినవారంతా ఆ పక్కకు ఎందుకు పోయారో చూస్తేనే అర్థమవుతుంది, వారు రాజకీయాలను నీచస్థాయికి దిగజార్చారు, ఆ స్థాయికి నేను దిగజారనవసరం లేదు' అంటూ ముఖ్యమంత్రి నిందించారు.
విప్‌ ధిక్కరించిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డిపై చర్య విషయాన్ని ప్రజారాజ్యం పార్టీ నాయకులు చూసుకొంటారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ అనుబంధ శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణకు కూడా కాంగ్రెస్‌ పార్టీ జారీచేసిన విప్‌ వర్తిస్తుందా అన్న మరో ప్రశ్నకు 'అవన్నీ సాంకేతికపరమైన అంశాలు, వాటిని సిఎల్పీ చూస్తుంది' అంటూ ఆయన సమాధానాన్ని దాటవేశారు.
జగన్‌ వర్గం ఎమ్మెల్యేలలో ఎవరైనా వెనక్కు తిరిగివచ్చే అవకాశముందా అన్న ప్రశ్నకు కూడా ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసిన వారందరిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. విప్‌ ధిక్కరించిన వారంతా శాసనసభ్యత్వాలను కోల్పోతే జరుగనున్న ఉపఎన్నికల ఫలితాలెలా ఉంటాయో తాను జోస్యం చెప్పదలుచుకోలేదని ముఖ్యమంత్రి అన్నారు. ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి విజయం సాధిస్తుందన్న విశ్వాసముందా అన్న ప్రశ్నకు 'ఎన్నికలు జరిగిన తర్వాత గదా ఫలితం తెలిసేది, నేను మీ మాదిరిగా ఫలితాలను ముందే ఊహించలేను' అని కిరణ్‌కుమార్‌ రెడ్డి సమాధానమిచ్చారు.
పార్టీ అధిష్టానం అనుమతి లభించిన తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఆయన మంత్రి పదవుల కోసం పూర్వపు ప్రజారాజ్యం నేత చిరంజీవి, ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. చిరంజీవితో తాను నిన్న కూడా మాట్లాడానని, వారిని ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకొంటామో అప్పుడు వారికి, మీకు అందరికీ చెప్పే చేస్తాం అని ఆయన మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ మంత్రివర్గ విస్తరణ సాధ్యపడదన్న గులాంనబీ ఆజాద్‌ ప్రకటనను ప్రస్తావించినప్పుడు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం అవసరమని అధిష్టానం, తాము ఎప్పుడు భావిస్తే అప్పుడు జరుగుతుందన్నారు. రాష్ట్ర శాసనసభలో ఆధిక్యతతో అవిశ్వాస తీర్మానంపై గెలిచిన తర్వాత కూడా తన ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఎవరైనా భావిస్తే తాను చేయగలిగిందేమీ లేదన్నారు.
తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని, దానిపై కేంద్రం, కాంగ్రెస్‌ అధిష్టానం సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటుందని కిరణ్‌కుమార్‌ రెడ్డి మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో సంప్రదింపులు ముగిశాయని, తెలంగాణ డిమాండ్‌ను అన్ని కోణాల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న కేంద్రం, రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సముచిత నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చట్టబద్ధమైన, ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయబోతున్నట్లు తనకేమీ తెలియదని, ఈ విషయాన్ని తాను పత్రికలలోనే చూశానని అన్నారు.