11, డిసెంబర్ 2011, ఆదివారం

ఉసురు తీస్తున్న ఆసుపత్రులు

ప్రభుత్వాసుపత్రులు మురికి కూపాలుగా, మృత్యుముఖాలుగా తయారు కావడంతో డబ్బు ఖర్చయినా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్న సామాన్య ప్రజలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయనడానికి తరచుగా వస్తున్న వార్తలే నిదర్శనం. శరీరంలో వివిధ విభాగాలకు పరీక్షల పేరిట ప్రజల జేబులు కొల్లగొడుతున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం మాట అటుంచి వారి ప్రాణాలకు భద్రత లేదనడానికి కోల్‌కతాలోని ఆమ్రి ఆస్పత్రిలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్ని ప్రమాదాన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఆస్పత్రులకు, ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ప్రస్తుత వ్యవస్థలో ఏ విధంగా లభిస్తున్నాయో మనందరికీ తెలుసు. నిబంధనలను ఉల్లంఘించని సంస్థల సంఖ్య వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఆస్పత్రులను ఇరుకైన ప్రాంతాల్లో నెలకొల్పరాదనీ, స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణంలో ఉంటేనే వైద్య చికిత్సలు ఫలిస్తాయన్నది జనం నమ్మకం. అయితే, ఇప్పుడు గాలి ప్రవేశించని ఇరుకైన సందుల్లో సైతం కార్పొరేట్‌ ఆస్పత్రులు వెలుస్తున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులన్న పదంలోనే వ్యాపార సంస్కృతి నిబిడీకృతమై ఉంది కనుక, ప్రైవేట్‌ ఆస్పత్రులు పూర్తిగా వాణిజ్యపరంగానే నిర్వహించబడుతున్నాయని వేరే చెప్పనవసరంలేదు. అంతేకాక, బహుళ అంతస్థుల ఆకాశ హర్మ్యాల్లో ఆస్పత్రులు నెలకొల్పడం అనేది సర్వసాధారణమైంది. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో ప్రమాదాలు సంభవించడం కూడా చాలా సహజమైన విషయంగానే భావించాల్సి ఉంటుంది.
భవన నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘన అనేది చాలా సహజమైన విషయం అయింది.ఆస్పత్రుల భవనాలే కాదు, అపార్టుమెంట్లు, ఇతర ప్రైవేట్‌ భవనాల నిర్మాణానికి నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మించడం అనేది ఒక్క కోల్‌కతాలోనే కాక, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో సర్వసాధారణమైంది. చట్టాలు,నిబంధనలు మొదలైనవన్నీ మనం రూపొందించుకున్నవే. వాటిని రూపొందించే ప్రజాప్రతినిధులే ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పుడు వాటి గురించి అసలు ఏమాత్రం తెలియని సామాన్య ప్రజలు వాటిని ఉల్లంఘించడం అబ్బురమూ కాదు, అసహజమూ కాదు. నగరపాలక,పురపాలక సంస్థల్లో ఉండే టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో భవనాల ప్లాన్‌లను ఆమోదింపజేసుకోవడం ఎలాగో ఈరోజుల్లో ఎవరికీ చెప్పనవసరం లేదు.బిల్డర్ల వద్ద ఈ పనులు చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారు. భవననిర్మాణ ఖర్చుల్లో ఈ అదనపు ఖర్చులను కూడా కలిపి బిల్డర్లు ఇండ్ల యజమానుల వద్ద వసూలు చేస్తూ ఉంటారు. కాకినాడ శ్యామలా నగర్‌లో ఇటీవల అపార్టుమెంటు కూలిన ఘటనలో ప్రాణనష్టం వాటిల్లకపోవడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. అసలు అపార్టుమెంట్లు, ఆకాశహర్య్మాలు ఇరుకైన సందుల్లో, జనసమర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మించకూడదన్న నిబంధనను కూడా ఇప్పుడు ఎవరూ పాటించడం లేదు. వాహనాలకూ ఇది వర్తిస్తుంది. పాత వాహనాల స్థానే కొత్త వాహనాలకు అనుమతి ఇవ్వాల్సి ఉండగా, పాతవి రోడ్ల మీద తిరుగుతుండగానే కొత్త వాహనాలకు అనుమతి ఇవ్వడం కూడా నిబంధనల ఉల్లంఘనే. భవన నిర్మాణాల్లో నిబంధనలు పాటించకపోవడం వల్ల అవి పేక మేడల్లా కూలిపోతుననట్టే, అడ్డు, అదుపు లేకుండా వాహనాల సంఖ్య పెరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.
ఉద్యమాలు, ఆందోళనలు జరుగుతున్నప్పుడైతే ఇక చెప్పనవసరం లేదు. బంద్‌లకూ, రాస్తా,రైల్‌ రోకోలకు రాజకీయ పార్టీలు పిలుపు ఇవ్వడం సర్వసాధారణమైంది. వీటి వల్ల అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు రోకో సంఘటనల కారణంగా ఇతర వాహనాలతో పాటు 'కుయ్‌ కుయ్‌' శబ్దంతో వేగంగా దూసుకుని వెళ్ళే అంబులెన్స్‌లు, 108 వాహనాలు కూడా ఆగిపోతున్నాయి. ఫలితంగా ఆ వాహనాల్లో అత్యవసర చికిత్స కోసం తీసుకుని వెళ్ళే రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. సమస్య ఎంత తీవ్రమైనది అయినా ప్రజలకు అసౌకర్యం కలిగించే రీతిలో ఆందోళనలు సాగించడం, నిబంధనలను ఉల్లంఘించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదనీ, ఇలాంటి ఆందోళనలు నిర్వహించే వారిపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఇటీవల ఆదేశించింది. పౌరజీవనానికి ఆటంకం కలిగిస్తున్న వారి పట్ల అటు ప్రభుత్వమూ, ఇటు ప్రజలూ చూసీ చూడనట్టుగా వ్యవహరించుకోవడం వల్ల ప్రజలు అవస్థలు పడటమే కాక, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పొగొట్టుకుంటున్నారు.
అలాగే, ప్రజాప్రతినిధులు నిబంధనలనూ, సభా సంప్రదాయాలను ఉల్లంఘించడం వల్ల అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమవుతూ ఉంటాయి. మన రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఉప ఎన్నికల భారం ప్రజలపైనే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. అటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా,వైద్య సంస్థలూ నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ వారు కొద్ది పాటి జరిమానా, లేదాశిక్షలతో బయటపడుతుండగా, ఏ తప్పూ చేయని ప్రజలపై అదన పు ఆర్థిక భారం పడుతుండటం గమనార్హం. ఎవరో చేసిన తప్పునకు ఆర్థిక భారాన్ని మోయడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రజల వంతు అవుతున్నది. కోల్‌కతా ప్రమాదం సంగతి తీసుకుంటే, శీతాకాలంలో అగ్ని ప్రమాదం సంభవించడం 'ఔరా' అని అనిపించే విషయమే. అయితే, విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉండే వాణిజ్య, వైద్య సంస్థలు, ఆస్పత్రుల్లో 'షార్ట్‌ సర్క్యూట్‌' వల్ల తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదాలు నివారించదగినవే అయినా, సిబ్బంది నిర్లక్ష్యం, రోగుల తరపు బంధువుల అజాగ్రత్తల వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదాహరణకు రోగుల తరఫు బంధువులు ఆస్పత్రుల ఆవరణల్లోనే పొయ్యి రాజేసి వంటలు చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే, ఆస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన వాటర్‌ స్టోరేజి ట్యాంకులు లేకపోవడం, బహుళ అంతస్థుల భవనాలకు ఉండాల్సిన సౌకర్యాలు లేకపోవడం రోగుల తరఫు బంధువులను పరిమితికి మించి ఆస్పత్రుల్లోకి అనుమతించడం వంటి కారణాల వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన రోగుల పట్ల సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వేరే చెప్పనవసరం లేదు. అలాగే, కార్పొరేట్‌ ఆస్పత్రులకు అవసరార్థం వచ్చే వారి పట్ల నిబంధనల పేరిట సిబ్బంది ఎంత దాష్టీకంగా వ్యవహరిస్తారో వేరే చెప్పనవసరం లేదు. ఆస్పత్రులకు, విద్యా సంస్థలకు ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన మౌలిక సదుపాయాలు ఉండకపోవడం ప్రమాదాలకు హేతువు అవుతున్నాయి. జీవితంలో వేగం పెరగడం వల్ల డబ్బు ఎర చూపి నిబంధనలను ఉల్లంఘించే ధోరణి ప్రజల్లో పెచ్చు పెరుగుతోంది.
ఫైవ్‌స్టార్‌ ఆస్పత్రులు ఇంటికన్నా గుడి పదిలం సామెతను గుర్తు చేస్తున్నాయి. ఆర్థిక నేరాలకు అరెస్టు అయి జైళ్ళలో ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఈ ఆస్పత్రులు స్వర్గధామాలు అవుతున్నాయి. వివిధ కుంభకోణాల్లో అరెస్టు అయిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు ఈ మధ్య ఆస్పత్రుల్లో చేరిన ఉదంతాలు కోకొల్లలు. అలాగే, అన్ని నిబంధనలు పాటించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో జనం రద్దీ ఎక్కువ కావడం వల్ల ప్రమాదాలు తరచుజరుగుతున్నాయి. కోల్‌కతా ఆస్పత్రి ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది దట్టమైన పొగ వల్ల ఊపిరి ఆడక మరణించిన వారే. అలాగే, జనం ఎక్కువ అయితే, తొక్కిసలాటలు సంభవించి ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనల గురించి కూడా మనకు తెలుసు.కనుక ఈ మాదిరి ప్రమాదాలకు ఆవలి వారు ఎంత బాధ్యులో ప్రజలు కూడా అంతే బాధ్యులు. పనులు త్వరగా ముగించుకుని పోవాలన్న తొందర, నిబంధనల పట్ల ఉదాసీనత, తనిఖీ యంత్రాంగం అవినీతి మయం కావడం ప్రమాద హేతువులు అవుతున్నాయి. ఇందుకు కోల్‌కతా సంఘటన గట్టి నిదర్శనం.