11, డిసెంబర్ 2011, ఆదివారం

అన్నదాత కరవు కేక ...ఆదుకోవడానికి ని'బంధనాలు'

మూడేళ్ళుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న కరవు పేద రైతు కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏటేటా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునే ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. మద్దతు ధరలు లేక, పంటలు గిట్టుబాటు కాక, పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీరక, బతుకుదెరువుకు మరోమార్గం లేక తీవ్రమైన సమస్యలతో విలవిలలాడుతున్న అన్నదాతలపై పాలకపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. బాధ్యతగల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్త్తేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నాయి. నష్టం అంచనాల నివేదికలు అధికారుల వద్ద అపరిష్కృతంగానే ఉంటున్నాయి. 2009 వరద బీభత్సం మొదలుకొని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏదో ఒక రకమైన కారణాల వల్ల కరవు విలాయ తాండవం చేస్తోంది. ముఖ్యమంత్రులు మారినా, ప్రతిపక్షాలు ఉద్యమించినా, అధ్యయన కమిటీలు ఆదుకోవాలని సిఫారసు చేసినా చలనం మాత్రం కనిపించడంలేదు. రైతు సంక్షేమం పేరుతో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నప్పటికీ అవేవీ బడుగు రైతు జీవితాలను బాగు పరచలేకపోతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారుల్లో నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలు వారి పాలిట శాపంగా మారుతున్నాయి.
రైతులు సాగుచేసిన పంటలు 50 శాతానికి మించి నష్టపోతేనే పరిహారం చెల్లించాలన్న ధోరణితో ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోంది. దీంతో అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా నష్టపరిహారం అందుతుందన్న నమ్మకం కలగడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో ప్రతి హెక్టారు పరిమాణంగా ఈ పరిహారాన్ని అందజేయాలని భావిస్తున్నాయి. వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిరప, ఉల్లి, కూరగాయలు, పూలతోటలు, బొప్పాయి తదితర పంటలకు ప్రతి హెక్టారుకు రూ.6 వేలు నష్టపరిహారంగా అందజేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రణాళిక తయారు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేలు భరించనుంది. అదే విధంగా జొన్న, సజ్జలు, రాగులు, ఆముదం, కలబంద పంటలకు ప్రతి హెక్టారుకు రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించగా, వర్షాభావ ప్రాంతాలకు రూ.2 వేలు మాత్రమే ఇవ్వనున్నారు. పప్పు ధాన్యాలు, పొద్దుతిరుగుడు, సోయాబిన్‌, గోధుమ, ఆజ్వాన్‌, అవిసె పంటలకు రూ.3,750 చెల్లించాలని నిర్దేశించగా, వర్షాభావ ప్రాంతాలకు రూ.2 వేలు మించి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కజొన్నకు హెక్టారు ఒక్కింటికి రూ.5 వేలు, ఉద్యానవన పంటలు, నర్సరీలకు రూ.4,500, మామిడి, నిమ్మ, జీడిమామిడి, సపోటా, జామ, దానిమ్మ, రేగు తోటలకు రూ.9 వేలు చెల్లించనున్నారు. సాగునీటి ప్రాంతాల్లో అరటి తోటలకు రూ.24 వేలు, వర్షాభావ ప్రాంతాల్లో రూ.6 వేలు, పొగాకు తోటలకు రూ.6 వేల చొప్పున పరిహారం చెల్లించాలని విపత్తుల నిర్వహణ శాఖ నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రతి హెక్టారుకు రూ.10 వేలకు తగ్గకుండా పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఇంత తక్కువ మొత్తంలో నష్టపరిహారం చెల్లింపునకు ప్రణాళికలు రూపొందించుకోవడం గమనార్హం.
కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాభావం, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు, సహకరించని వాతావరణం, కరెంటు కోత, గాడి తప్పిన నీటి యాజమాన్యం తదితర కారణాలు వ్యవసాయ రంగాన్ని గట్టెక్కనీయడం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యేక బృందాలతో అధ్యయనంచేసి వాస్తవాలను జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ, కరవు పీడిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు ప్రారంభంకాలేదు. నష్టపోయిన రైతులకు గత మూడేళ్ళుగా పరిహారం అందని ద్రాక్షగానే మిగులుతోంది. 2009 వరద బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తించినా, అనంతరం 2010లో పెద్దఎత్తున సంభవించిన కరవుపై పలుసార్లు కేంద్ర బృందాలు పర్యటించి అధ్యయనం చేసినా బాధితులను ఆదుకోవడంలో జరుగుతున్న జాప్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కూడా అంతకు రెట్టింపు స్థాయిలో దారిద్య్రం గ్రామీణ ప్రజలను వెంటాడుతోంది. 84 శాతం ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాని కారణంగానే కరవు ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ గుర్తించినప్పటికీ ప్రభుత్వ చర్యలు హామీలకే పరిమితమవుతున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో పంటలు ఎండిపోయినందున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 మండలాలను ప్రభుత్వం కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 868 మండలాల్లో తీవ్రమైన కరవు ఉన్నట్లు గుర్తించారు. 12 జిల్లాలు పూర్తిగా దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.
ఇదంతా కాదని కేంద్ర ప్రభుత్వం కరవు ప్రాంతాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) సంస్థకు బాధ్యతలు అప్పగించింది. కోనసీమ మొదలుకొని తెలంగాణ జిల్లాలకు సైతం పాకిన పంటల విరామంపై ప్రభుత్వం నియమించిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా కమిటీ పూర్తిస్థాయి నివేదిక సమర్పించినప్పటికీ, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రైతు సంఘాల సమావేశంలో స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ బాధితులకు ఒక్కపైసా పరిహారం అందిన దాఖలాలు లేవు. అనంతరం తలెత్తిన కరవుపై ప్రతి జిల్లాకు ప్రత్యేకాధికారిని నియమించి పరిస్థితులపై నివేదికలు రప్పించినప్పటికీ ఇంకా చర్యలు ప్రారంభం కాలేదు. నష్టపోయిన రైతుల పూర్వాపరాలు, స్థితిగతులను కంప్యూటర్లలో భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడి ప్రతి విషయాన్ని నివేదిక రూపంలో కేంద్ర సర్కారుకు సమర్పించి ఆదుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఢిల్లిd పెద్దలకు కనికరం కలగడంలేదు. ఈ సమాచారాన్ని అనుమానిస్తూ ఐఐఎం నిపుణులు అధ్యయనం చేసిన తర్వాతనే ఆదుకుంటామన్న సంకేతంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ నెలాఖరులోగా ఐఐఎం ప్రత్యేక ప్రతినిధి బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. పంటల విరామం ప్రకటించిన ప్రాంతాలతో పాటు ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల్లోనూ ఈ అధికారులు పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్ళ వరుస కరవు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ 2011 నైరుతి రుతుపవనాల సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులుగా నియమించబడిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు ఆయా జిల్లాల్లో పర్యటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. గ్రామాల వారీగా నష్టం అంచనాల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ బాధిత రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, నష్టపరిహారం తదితర లబ్ధి చేకూర్చడానికి డ్రాట్‌ కంట్రోల్‌ రూమ్‌లను సంప్రదించాలని సూచనలు ఇవ్వడం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. వ్యవసాయ, ఉద్యానవన పంటలకు సంబంధించి పది జిల్లాల్లో మదింపు కార్యక్రమం కొనసాగుతున్నట్లు రెవెన్యూ శాఖ చెబుతోంది. వర్షాభావం, విద్యుత్‌ కోత కారణంగా వరి, వేరుశనగ, ఉల్లి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, ఆముదం, కంది పంటలు పెద్దఎత్తున నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ధ్రువీకరించింది. 23,320 హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు తాజాగా ఉద్యానవన శాఖ స్పష్టంచేసింది. అయినప్పటికీ పశుగ్రాసం కొరత తీర్చే కార్యక్రమాలు ఎక్కడా ప్రారంభం కాలేదు. 75 శాతం ప్రత్యేక సబ్సిడీపై 6వేల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం విత్తనాలు విడుదలైనప్పటికీ ఇంకా రైతుకు అందలేదు. కరవు పీడిత ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు దొరకడం లేదు. ఇందుకోసం రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.8,200 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారిక ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ అనేక ప్రాంతాల నుంచి వలసలు ఏమాత్రం ఆగడంలేదు.
ఒకవైపు కటిక దారిద్య్రం రాష్ట్రాన్ని వెంటాడుతుంటే, మరోవైపు భూగర్భ జలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. నీటి వినియోగం అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా తాగునీటికి సైతం తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. గడిచిన సెప్టెంబర్‌ మాసంతో పోల్చిచూస్తే ఇప్పటి వరకు భూగర్భ జలాలు రెండింతల లోతుకు చేరుకున్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలోనూ ఈ సమస్య తీవ్రమవుతోంది. భూగర్భ జల శాఖ అధికారుల సమాచారం మేరకు సరాసరిగా 1.57 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయినట్లు తెలుస్తోంది. నెల రోజుల్లోనే ప్రకాశం జిల్లాలో 3.75 మీటర్లు, గుంటూరు జిల్లాలో 2.65 మీటర్ల లోతుగా జలాలు తగ్గిపోయాయి.