పోలవరం కుడి కాలువ పొడవెంతో చెపితే జగన్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తామని కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన హరిత యాత్రపై రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని కోరుతూ జగన్ పాదయాత్రపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఏ నదిమీద ఉందో కూడా తెలియని జగన్.పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాలన్న లక్ష్యమే గానీ ప్రజా సమస్యలు పట్టవని.. ముఖ్యమంత్రి పదవి కోసం... తండ్రి అంత్యక్రియలు పూర్తికాకముందే ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేపట్టిన ఘనుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు.
కడప జిల్లాలోనే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరిగితే ఆ లెక్కే వేరన్నారు. జగన్ వద్ద ఓటర్లను, నేతలను కొనేందుకు డబ్బు ఉందన్నారు. కడప, పులివెందులకు జరిగే ఉప ఎన్నికలను రెఫరెండంగా స్వీకరించలేమని.. ఈ ఉప ఎన్నికల్లో గెలుపుపై ఎలాంటి సందేహం లేదన్నారు. చిరంజీవి వల్ల తమకు కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగినా.. మొత్తంమీద ఎక్కువ లాభం చేకూరుతుందని డీఎల్ వ్యాఖ్యానించారు.