జగన్ పెడుతున్న పార్టీని ఎలా ఎదుర్కొనాలో అర్ధంకాని కాంగ్రెస్ నేతలకు మెంటల్ వచ్చినందునే ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకున్నారని... ఇక ఆ పార్టీ ఉన్నా లేనట్లేనని జగన్ వర్గ నేత, కాంగ్రెస్ పార్టీ ఎమెల్సీ జూపూడి ప్రభాకరరావు వాఖ్యానించారు. సామాజిక న్యాయం చేస్తామంటూ పుట్టుకొచ్చిన చిరంజీవివి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసేందుకు గత ఎన్నికల తరువాత నుండే చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయని అన్నారు.
ఉప్పెనలా జగన్ వెంట నడుస్తున్న జనవాహినిని చూసి కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తి పోతోందని... రాష్టంలో కాంగ్రెస్ పార్టీని నిలదొక్కుకునేందుకు అవకాశాలు ఏమాత్రం లేనేలేవని... ఇక రాష్ట్రం ఏకధాటిగా పాలించే పార్టీ జగన్ పార్టీయేనని జోస్యం చెప్పారు. చిరంజీవివినే కాదు ఏ శక్తులని కాంగ్రెస్ వినియోగించినా జగన్ ముందు బలాదూర్ అన్నారు జూపూడి.