రైలు ఎక్కి మీ ఊరికి వెళ్ళాల్సి ఉందా.... అయితే అరగంట ముందే రైల్వేస్టేషన్‌లో ఉండే విధంగా ఇంటి నుండి బయలుదేరండి. లేకుంటే మీరు వెళ్ళాల్సిన రైలు మీరొచ్చేలోపే వెళ్ళి పోతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఆ విధంగా తయారైంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాంలే. తాము చేరుకోవాల్సిన గమ్యానికి ఇంటి నుండి గంట ముందు బయలుదేరినా చేరుకోలేకపోతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి రైలెక్కి వివిధ ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు చాలామంది వారు వెళ్ళాల్సిన రైలు ఈ ట్రాఫిక్ జామ్‌ల వల్లా మిస్‌అవుతున్నారు. ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకొని సమయానికి రైళ్ళో వెళ్ళాలనుకునే వారికి ఈ ట్రాఫిక్ జామ్‌ల ద్వారా సమయానికి చేరుకోలేకపోతున్నారు. సికింద్రాబాద్‌లోని ఏ రోడ్‌లో చూసిన ట్రాఫిక్ జామే ఉండడంతో ప్రయాణానికి వెళ్ళేవారు అనుకున్న సమయం కంటే ముందుగా ఇంటి నుండి బయలుదేరితే మంచిదని చాలామంది స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు చెప్తున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుండి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరేందుకు బేగంపేట రోడ్, రాష్ట్రపతిరోడ్, యంజిరోడ్, ఎస్పీరోడ్, టాంక్‌బండ్, తార్నాకరోడ్, సెయింట్‌మేరిస్ రోడ్, చిలకలగూడ రోడ్ వంటి ప్రధాన మార్గాలు ఉన్నా బేగంపేట్, తార్నాక, సికింద్రాబాద్, ఎస్పీరోడ్‌లన్ని ఉదయం నుండి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. రద్దీని నివారించేందుకు పోలీసుల తిప్పలు అన్ని ఇన్ని కావు. ఒక్కొక్కసారి ట్రాఫిక్‌ను చూసిన పోలీసులు విసుగుచెంది ఓ ప్రక్కకు నిల్చున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే ట్రాఫిక్ సమస్యకు మరోకారణం ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఉన్న రోడ్ల సమస్య ప్రయాణికులకు తీవ్ర నరకాన్ని చూపిస్తుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే రైళ్ళు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి బయలుదేరుతుంటాయి. ఇక్కడినుండే చాలామంది నగర వాసులు, చుట్టుపక్కల శివారు ప్రాంత ప్రజలు ఈ స్టేషన్ నుండే బయలుదేరి వెళ్తుంటారు. అయితే సికింద్రాబాద్‌లో కాలు పెట్టగానే అసలు సమస్య తలెత్తుతుంది. మరో అరగంటలో లేదా పావుగంటలో రైలు ఉంటే మాత్రం ఇంకా ఆ రైలుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇది మన సికింద్రాబాద్ ట్రాఫిక్ సమస్య, ఈ ట్రాఫిక్ సమస్యను నివారించాలంటే ఇకా ఆ భగవంతుడే దిగిరావాలి.