28, ఫిబ్రవరి 2011, సోమవారం

పెన్ను మూసిన ముళ్ళపూడి

అచ్చ తెలుగు సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ చెన్నైలోని అభిరామపురంలో ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముళ్ళపూడి విఖ్యాతుడైన రమణ 1931 జూన్‌ 28న ధవళేశ్వరంలో జన్మించారు. ఆయన అసలు పేరు ముళ్లపూడి వెంకటరావు. ఆయన ఎంత గొప్ప రచయితో అంత సినీ రచయిత కూడా! ఆయన రాసిన పిల్లల పుస్తకం 'బుడుగు' తెలుగు సాహిత్యంలో విష్టమైన స్థానాన్ని పొందింది. అలాగే ఆయన రాసిన ఆత్మకథ 'కోతికొమ్మచ్చి' అశేష పాఠకాదరణ పొందింది. రుణానంద లహరి, రాజకీయ బేతాళ వింశతి, ఇద్దరమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల ప్రేమ కథ వగైరాలలో ఆయన పెన్ను అనేక మెరుపులు మెరిపించింది.
ఆయన సినీ రంగ ప్రవేశమే ఎంతో విచిత్రంగా జరిగింది. బైట గొప్ప హాస్య రచయితగా పేరున్న రమణ అనూహ్యంగా రక్తసంబంధం లాంటి గొెప్ప విషాదభరిత, సెంటిమెంట్‌ సినిమాకు పనిచెశారు. 1961లో రిలీజ్‌ అయిన పాశమలర్‌ తెలుగులో రక్తసంబంధంగా రీమేక్‌ చేసారు. అప్పటిదాకా మిస్మమ్మ... గుండమ్మ కథ...లాంటి సినిమాల్లో జంటగా ఎన్టీఆర్‌...సావిత్రి అన్నాచెల్లెళ్లగా 'ఇందులో నటించడమే కాదు...కరుణరసాన్ని అద్భుతంగా పండించారు. మరో అల్‌ టైం క్లాసిక్‌ మూగమనసులు సినిమాలో ఆత్రేయతో కలిసి చేశారు. అప్పటిదాకా గొప్ప గ్లామర్‌ పైర్‌గా వెలిగిపోతున్న సావిత్రి అక్కినేని కాంబినేషన్‌ను అనూహ్యమైన మలుపు తిప్పారు. సావిత్రి వద్ద పనిచేసే పాత్రలో అక్కినేని తీసుకోవడం, సావిత్రితో రా అని పించడం యాంటి సెంటిమెంట్‌ అప్రోచ్‌తో సినిమాను సూపర్‌ డూపర్‌ హిట్‌ చేయడంలో ఆయన పాత్ర కూడా ఉంది.
బాపు, ముళ్లపూడి ప్రాణ స్నేహితులు. ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాల వంటి వారు. వారి అనుబంధం షష్టిపూర్తి కూడా చేసుకుంది. స్కూల్లో మొగ్గ తొడిగిన ఆ స్నేహం పత్రికా రంగంలో కొంటె బొమ్మగా, చలన చిత్రరంగంలో కదిలించే బొమ్మగా ప్రతి ఫలించింది. రచయితకు సినిమా రంగంలో ఉన్న విలువేంటో అయిదేళ్లలో...ఏడెనిమిది సినిమాల్లో చూపిన రమణ తన దృష్టిని సినిమా నిర్మాణం వైపు మళ్ళించాడు. అప్పటి వరకూ కుంచె పట్టడం తప్ప సినిమాలో ఏమాత్రం అనుభవం లేని బాపుని దర్శకుడిగా ఒప్పించి సాక్షి సినిమా తీసారు. సూపర్‌ స్టార్‌ కృష్ణకు కూడా ఇది ఆల్‌ టైం
బెస్ట్‌ మూవీగా పేరు తెచ్చి పెట్టింది. సాక్షి సినిమాకు తాను నిర్మాతగా ఉండి బాపును ఏ ముహూర్తంలో దర్శకుడిని చేశారో కాని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు తెలుగునాట మోత మోగిపోయాయి. బాక్సాఫీస్‌ వద్ద బోర్లాపడిన సినిమాలు కూడా ఎంతో నాణ్యంగా, నిపుణంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. బంగారు పిచుక, ముత్యాల ముగ్గు, పెళ్లిపుస్తకం, మిస్టర్‌ పెళ్లాం, రాధాగోపాళం, కృష్ణావతారం, సంపూర్ణరామాయణం, బంగారుపిచ్చుక, గోరంత దీపం, మన ఊరి పాండవులు, రాజాధిరాజు సినిమాలలో రమణ అందించిన సంభాషణలు ఇప్పటికీ ప్రేక్షకులకు కంఠోపాఠం. మూగమనసులు సినిమాకు కథా సహకారం అందించారు. రక్తసంబంధం, సినిమాకు మాటల రచయితగా, అక్కినేని నాగేశర్వరావునటించిన బుద్ధిమంతుడు, అందాల రాముడు సినిమాలకు కథారచయితగా పనిచేసిన ముళ్లపూడి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేశారు. రక్తసంబంధాలు, మూగమనసులు సినిమాలకు పనిచేసినా రమణకు రచయితగా పూర్తిస్థాయి గుర్తింపు తెచ్చింది దాగుడుమూతలు సినిమా. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు 'మిస్టర్‌ డీడ్‌ గోస్‌ టు వాషింగ్టన్‌' అనే హాలీవుడ్‌ సినిమా నుంచి ప్రేరణ పొంది రాశానని ముళ్లపూడే స్వయంగా చెప్పుకున్నారు. తర్వాత వచ్చిన ప్రేమించిచూడు, కన్నెమనసులు, నవరాత్రి, పూలరంగడు, ప్రాణమిత్రులు వగైరా చిత్రాలన్నీ రచయితగా రమణను ఉన్నతస్థాయిలో నిలబెట్టాయి. పాపికొండల్లో తొలిసారి కెమెరా పెట్టి గోదావరి అందాలను వెండి తెరకెత్తిన ఘనత కూడా బాపు, రమణలకే దక్కింది. గోదావరి ప్రయాణ నేపధ్యంగా తీసిన అందాల రాముడు తీసారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పల్టిd కొట్టినా అధైర్య పడకుండా బాపు రమణలు వాళ్ల మీదే వాళ్లు కార్టూన్లు వేసుకుని ఓటమిని ఎంజాయ్‌ చేశారు. ఆనాటి అందాల రాముడే నిన్నటి శేఖర్‌ కమ్ముల గోదావరికి ప్రేరణ అయింది. తాజాగా బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' సినిమాకు ముళ్లపూడే రచయిత.
1973లో 'అందాలరాముడు', 1975లో 'ముత్యాలముగ్గు', 1991లో పెళ్లిపుస్తకం, 1993లో 'మిస్టర్‌ పెళ్లాం' చిత్రాలు ఆయనకి నంది అవార్డులు తెచ్చాయి. 1981లో 'వంశవృక్షం' చిత్రానికి కళాసాగర్‌, సితార అవార్డులు పొందారు. అరవై చిత్రాల రచయిత ముళ్లపూడిని 1987లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఇక ఆయన్ని వరించిన పదవులు, బిరుదులు అనేకం. 1989లో ఆంధ్రప్రదేశ్‌ చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1990లో ఆలిండియా చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 1992లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1992లో అమెరికా తెలుగు అసోసియేషన్‌ 'శిరోమణి' బిరుదుతో, బాలల అకాడెమీ 'బాలబంధు' బిరుదుతో సత్కరించాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, క్రోక్విల్‌ అకాడెమీ రెండూ సంయుక్తంగా లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించాయి.
ముత్యాల ముగ్గు సినిమాలో రమణ అందించిన ఓరంత కట్టపడిపోతన్నా వేటిరా కొత్తపెళ్లి కొడకా...అంటూ వెటకారాలాడినా...ఆ ముక్క నేను లెక్కట్టుకో మునపే సెప్పాల...డిక్కీలో తోయించేగల్ను జగరత్త...మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? వోల్‌ మొత్తం మీద ఏమయినా కన్సెసను ఉంటుందా?...అంటూ ఆయన రాసిన డైలాగులు తెగపేలాయి.
రమణ కురిపించిన కరుణరసానికి మంచి ఉదాహరణ భక్తకన్నప్ప. కృష్ణంరాజుని గిరిజనుడిగా... శివ భక్తుడిగా...రెండు పాత్రలలోని వేరియేషన్ని తన రచనలో గొప్పగా చిత్రించాడు రమణ. మెగాస్టార్‌ చిరంజీవికి కొత్తల్లో అద్భుతమైన బ్రేక్‌ ఇచ్చిన సినిమా, కృష్ణంరాజుకు బ్రహ్మాండమైన పేరు తెచ్చిన సినిమా మన ఊరి పాండవులు. మహాభారతాన్ని లోకలైజ్‌ చేస్తూ రాసిన ఈ సెటైర్‌లో ఇటు కృష్ణంరాజు డైలాగులు. అటు రావుగోపాలరావు డైలాగులు... తెలుగు దేశాన్ని ఉర్రూతలూరిన్చాయి. రాజాధిరాజులో సైతాను శిశువా...అంటూ రమణ రాసిన డైలాగులు ఎంతో పాపులర్‌ అయ్యాయి. తర్వాత రాధా కళ్యాణం-పెళ్లిdడు పిల్లలు...ఆ తర్వాత చిరంజీవితో మంత్రిగారి వియ్యంకుడు రమణ కలం డైలాగులు కక్కింది.
రమణ కలం నుంచి జాలువారిన మరో దృశ్యకావ్యం పెళ్ళిపుస్తకం...అడుగడుగునా కొత్తకొత్త గిల్లికజ్జాలు... జెలసీ... ద్వేషాలు... ఆశ్చర్యాలు...భార్యా భర్తల మధ్య తియ్యని రాజీలు... అనుమానం నుంచి అర్థం చేసుకోడాలు. అర్థం చేసుకోవడం నుంచి సౌఖ్యాలు...సౌఖ్యం నుంచి సంతోషాలు...సంతోషం నుంచి స్వార్థం...స్వార్థం నుంచీ మళ్ళీ అనుమానాలు...ఇలా అంతులేని వలయంగా తిరిగే మొగుడు పెళ్ళాల గోలను జరంజకంగా రచించాడు రమణ. భార్యభర్తల మధ్య సంబంధాలను మరో కోణం నుంచి సృశించిన సబ్జెక్ట్‌ మిస్టర్‌ పెళ్ళాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే వాదం నుంచి పుట్టిన వివాదానికి రమణ అద్దిన పదాల సొబగులు సినిమాను అందంగా తీర్చిదిద్దాయి. రాధాగోపాలం కూడా భార్యాభర్తల వాదాలు వివాదాల నేపథ్యంలో తయారైందే! ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద బోర్లాపడినా అందులో విలువలకు, బాపు రమణ మార్క్‌ చెణుకలక లోటేలేదు. ఈ విధంగా ఆబాల గోపాలాన్ని అలరించిన అచ్చతెలుగు కలం రమణ కలం.