చట్టం తన చేతుల్లో ఉందన్న ధైర్యమో.. లేక ఎంతమందినైనా పెళ్లాడవచ్చని మతం చెప్పిందని సాకు చెప్పించవచ్చన్న ధైర్యమో తెలియదు గానీ ఓ ఖాకీ తన కంటికి అందంగా కనిపించిన.. మనస్సు మెచ్చిన అమ్మాయిలను వలచి మనువాడేశాడు వరుసగా... ఇదేదో ఒక్కసారో రెండు సార్లోకాదు.. ఏకంగా ఐదుగురిని. ఒకరిని తెలియకుండా మరొకర్ని పెళ్లాడేశాడు. ఈమధ్యే సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదవీ విరమణ కూడా చేసిన ఈయన గారి భాగోతం ఆయన నాలుగో భార్య పోలీసు స్టేషన్ మెట్లెక్కినా ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించటంతో బయటపడింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ నివాసి అయిన గులాం మహ్మద్ పోలీసు శాఖలో పని చేస్తూ ఎక్కడ పని చేస్తే అక్కడ ఓ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోవడం అనవాయితీగా మార్చుకున్నాడు. ఇప్పటికే నలుగురిని వదిలించుకుని ఐదో భార్యతో కాపురం చేస్తున్న ఈయన గారు తనని పట్టించుకోవడంలేదని నాలుగో భార్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఖాకీ చొక్కాలు తమ మాజీ బాస్ వ్యవహారంపై స్పందించకుండా ఎప్పటిలాగానే ఆమెను స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నారు. దీంతో విసిగివేసారిన ఆమె నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. దానికీ స్పందన లేకపోవడంతో మీడియా సాక్షిగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.
తనని తన పిల్లల్ని వదిలేశాడని దీనివల్ల తామంతా అనాథలంగా మారిపోయామని కన్నీరుమున్నీరైంది. ఎట్టకేలకు సిటీ పోలీసు బాస్ స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో గులాం అహ్మద్‌ను అంబర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. మరి ఈయన గారికి ఏ శిక్షపడుతుందో... లేక ఖాకీల అండదండలతో తప్పించుకుంటాడో వేచిచూడాలి.