3, మార్చి 2011, గురువారం

కమలినీ ముఖర్జీ పుట్టినరోజు మార్చి 4.

కమలినీ ముఖర్జీకి చిన్నతనం నుంచీ నటనమీద ఆసక్తి ఏర్పడటంతో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల్లో నటించేది. ఎక్కువగా పురుష పాత్రలు పోషించేది. అందుకే థియేటర్‌ ఆర్ట్‌ కోర్స్‌ కూడా చేసింది. కవిత్వం రాయడం, పెయింటింగ్‌ చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఆమె హాబీలు. భరత నాట్యం కూడా నేర్చుకుంది. నటిగా కెరీర్‌ ప్రారంభించడానికి ముందు కవిత్వానికి సంబంధించిన ఓ వెబ్‌ సైట్‌తో ఆమె పొందుపరచిన థాట్స్‌, కన్ఫ్యూజన్‌, సాలిట్యూడ్‌ అనే టైటిల్స్‌తో రాసిన పద్యాలు వల్ల దలైలామా అధ్యక్షత వహించిన అమెరికాలోని వాషింగ్టన్‌ డిసి సభకి హాజరు కాగలిగింది. ముంబయిలో థియేటర్‌ ఆర్ట్‌ కోర్స్‌ చేసాక చాలా నాటకాల్లో నటించింది. అయితే ఈసారి స్త్రీ పాత్రలే పోషించింది. నీల్‌ కమల్‌, పారాచ్యూట్‌, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, ఆయుష్‌ వంటి ప్రకటనలకు మోడలింగ్‌ చేసింది.

యాడ్‌ మోడల్‌గా ఆకట్టుకోవడంతో రేవతి దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రం 'ఫిర్‌ మిలేంగీ' చిత్రంలో నటించగలిగింది. ఎయిడ్స్‌ ప్రధాన అంశంగా గల ఈ చిత్రంలో రేడియో జాకీగా ఆమె నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'ఆనంద్‌' లో నటించే అవకాశం లభించింది. 2004లో విడుదలైన ఈ చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డు స్వీకరించింది.

మీనాక్షి, స్టైల్‌, గోదావరి, క్లాస్‌మేట్స్‌, పెళ్ళయింది కానీ, హ్యేపీడేస్‌, గమ్యం, జల్సా, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, గోపి గోపిక గోదావరి, పోలీస్‌ పోలీస్‌, మా అన్నయ్య బంగారం, నాగవల్లి తెలుగు చిత్రాల్లో నటించింది. 'గోదావరి, హ్యాపీడేస్‌, గమ్యం, గోపి గోపిక గోదావరి చిత్రాల్లో చక్కన నటన ప్రదర్శించిందనే పేరు వచ్చింది. 'వెట్టయ్‌యాడు విలయ్‌ యాడు' తమిళ చిత్రంతో 2006లో తమిళరంగానికి పరిచయమై 'కాదలన్‌ సుమ్మ ఇల్లయ్‌' చిత్రంలో నటించింది. ఆ తరువాత తమిళంలో ఆఫర్లు రాలేదు. ఒక కన్నడ చిత్రం 'సావరి' చేసి ఊరుకుంది. మలయాళ చిత్రం కుట్టి ష్రాంకు చేసింది. మలయాళంలో ఆఫర్లు వస్తున్నా ఇంకా అంగీకరించని కమలినీ ముఖర్జీ తెలుగు చిత్రాల్లో మంచి నటిగా పేరొచ్చినా ప్రస్తుతం ఒక చిత్రంలోనే చేస్తూ ఇంకా అవకాశాలు ఎందుకు రావట్లేదా అనే ఆలోచనల్లో పడింది. కోల్‌కతాలో 1984లో జన్మించిన కమలినీ ముఖర్జీ పుట్టినరోజు మార్చి 4.