3, మార్చి 2011, గురువారం

తెలంగాణ కోసం..శివుడిని కోరుకున్నా..గద్దర్‌

తెలంగాణ రాజకీయ నాయకులు,ప్రజలు ఒక్కటైనప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తధ్యమని ప్రజాగాయకుడు,ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్‌ అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం పోచారం గ్రామంలో గల శ్రీస్పటికలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో తెలంగాణ ఏర్పాటు కోసం మహాశివరాత్రి సందర్భంగా శివనామం జపిస్తూ ఉపవాసదీక్ష కార్యక్రమంలో బుధవారం రాత్రి గద్దర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకుంటున్నారని, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు గ్రహించి ఒక్కటవ్వాలని అన్నారు. ఓటు వేసిన ప్రజలు తెలంగాణ కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్న ఎందుకు పెట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేంద్రం తెలంగాణ విషయంలో శ్రీకృష్ణకమిటిని ఏర్పాటు చేస్తే సమస్యను పరిష్కరించకుండా ఆరు అంశాలను ముందుంచి చేతులు దులుపుకుందని ఎద్దెవా చేశారు. తెలంగాణలోని విలువైన భూములను సీమాంధ్రపాలకులు వ్యాపారవేత్తలకు అమ్మివేసి అక్కడి ప్రాంతాలను అభివృద్ది చేసుకుంటున్నారని విమర్శించారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,500 ఎకరాల భూమిని ఎకరాకు 100 రూపాయల చొప్పున దారాదత్తం చేశామన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు కట్టిన వారు తెలంగాణ వారు అయితే నీళ్లను ఆంధ్రవాళ్లు వాడుకొని కన్నీళ్లను తెలంగాణవాదులకు మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆస్తులను మింగెటోడిని శివుడు మూడోకన్ను తెరిచి బస్మం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించి చెప్పారు.తెలంగాణ కోసం ఇంకా ఎంత మంది అమరులు కావాలని అడ్డుపడుతున్న ,ఇచ్చేవాళ్లకు మంచి బుద్దిని ప్రసాదించాలని శివుడిని కోరుతున్నట్లు తెలిపారు.జై తెలంగాణ అనగానే సరిపోదని, అన్ని గ్రామాల జెఎసి నాయకులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.తాను పాట కోసం పాట పాడనని ఆట కోసం ఆట ఆడనని ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల్లో నుండి నా పాట పుడుతుందన్నారు. 

జైబోలో తెలంగాణలో గద్దర్‌ ఆలపించిన 'పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా'అనే పాటను సభలో పాడినప్పుడు ప్రజలంతా డ్యాన్సులు చేసి సభ ప్రాంగణమంతా ఉర్రూతలూగించారు.జై తెలంగాణ నినాదాలతో గ్రామం మారుమ్రోగింది. అక్కడి పిల్లలను తెలంగాణ వస్తే లాభం ఏమిటని అడిగి తెలుసుకున్నారు.