అట్టహాసంగా చేసే ప్రచారం ఒక్కోసారి సినిమాకు ప్రతికూలం అవుతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితి తాజాగా విడుదలైన 'కుదిరితే కప్పు కాఫీ' ఎదుర్కొంది. ప్రచారానికి తగినట్టుగా సినిమాలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. చిత్రం అంచనాలు తారుమారు చేస్తూ డల్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇది సినీ వాణిజ్య వర్గాలని ఆశ్చర్యపరిచింది. చేసిన ఓవర్ ప్రచారం రివర్స్ అయిందని, మార్నింగ్ షోతోనే జాతకం తెలిసిపోయిందంటున్నారు. ప్రేమకథా చిత్రాల హీరోగా జోరు మీద ఉన్న వరుణ్‌సందేశ్‌కు బ్రేక్ పడినట్టే. కథలో కొత్తదనం లేనప్పుడు ప్రచారాలు కూడా పనికిరావని ఈ చిత్రం నిరూపించింది.
ఇక మరోవైపు కామెడీ చిత్రాల హీరో రాజేంద్రప్రసాద్ కొత్త సినిమా 'భలే మొగుడు-భలే పెళ్ళాం' చిత్రం పరిస్థితి కూడా సేమ్. వినోదభరిత చిత్రాలను అమితంగా ఇష్టపడే ప్రేక్షకులు సైతం ఈ చిత్రాన్ని వీక్షించడానికి రాకపోవడం గమనార్హం. ఒకే రోజు విడుదలైన ఈ రెండు చిత్రాల ఫలితం నిరాశ కలిగించడంతో పరిశ్రమలో ఫ్లాప్‌ల పరంపర కొనసాగుతున్నట్టుగా ఉంది. నటకిరీటి రాజేంద్రప్రసాద్ సినిమా అనగానే ఒక మోస్తరు ప్రేక్షకులైనా సరే ఉండాలి. అయితే నేటితరం ప్రేక్షకులు మాత్రం కొత్తదనం ఉంటేనే సినిమా చూడ్డానికి ఇష్టపడుతున్నారని సినీ పండితుడు ఒకరు చెప్పారు.