మహాశివరాత్రి సందర్బంగా వివిధ రకాల పండ్లకు మంచి గిరాకి ఉండటంతో వాటి ధరలు భగ్గుమన్నాయి. శివరాత్రిని పురస్కరించుకొని ఉపవాసదీక్ష చేపట్టే భక్తులు సాయంత్రం దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించిన తరువాత పండ్లు తినండ ఆనవాయితీ. దీంతో తప్పని సరిగా పండ్లను కొనుగోలు చేయాల్సి ఉండగా ధరలు మాత్రం చుక్కలనంటాయి. ఇదే అదనుగా పండ్ల వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తూ రెండు చేతులా ఆర్జించారు. పండగ సందర్బంగా పండ్లకు గిరాకి అధికంగా ఉండటంతో ఘట్‌కేసర్ మండల కేంధ్రంలోని బస్‌టర్మినల్ సమీపంలో వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారి పొడవునా టెంట్లు వేసుకొని పండ్ల వ్యాపారులు మరీ విక్రయించారు. పండ్ల ధరలను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. కజ్జూర కిలో రూ.250, ద్రాక్షా కిలో రూ.70, యాపిల్ ఒకటి రూ.20, అరటిపండ్లు డజన్ రూ.50, సంత్రాలు ఒకటి రూ.5, పుచ్చపండు ఒకటి రూ.100 చొప్పున విక్రయించారు. పండగ రోజు ఉపవాస దీక్ష చేసే వారికి తప్పని సరిగా పండ్లు అవసరం ఉండటంతో ధరలు ఎంత ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో కొనుగోలు చేసినట్లు భక్తులు తెలిపారు. ఏది ఏమైనా ఇంత మంచి సమయం మించితే దొరకదు అనే విధంగా ఇష్టాను సారంగా వ్యాపారులు వ్యవహరించారని చెప్పారు.