3, మార్చి 2011, గురువారం

లిబియా సైన్యానికి చిక్కిన డచ్‌ నౌకలు

రాజకీయ సంక్షోభంలో ఉన్న లిబియా నుంచి తమ దేశస్థులను తరలించేందుకు వచ్చిన మూడు డచ్‌ నౌకలు లిబియా సైన్యానికి బందీలుగా చిక్కాయి. ఐదు రోజుల క్రితం లిబియా సైన్యం ఆధీనంలో ఉన్న నౌకల విడుదలకు డచ్‌ ప్రభుత్వం చర్చలు నిర్వహిస్తోంది. తాము నౌకల సిబ్బందితో సంబంధాలు కొనసాగిస్తున్నామని డచ్‌ రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒట్టే బీక్‌స్మా తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నౌకలకు విముక్తి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నౌకలతోపాటు లైంక్స్‌ అనే హెలికాప్టర్‌ కూడా లిబియా అధ్యక్షుడు గడాఫీ అనుకూల సైన్యం చేతిలో చిక్కుకున్నాయి. ఈ విషయాన్ని డచ్‌ దినపత్రిక టెలిగ్రాఫ్‌ గురువారం సంచికలో ఓ వార్తాకథనం ప్రచురించింది. సెర్టే ప్రాంతంలోని తీరానికి నౌకలు చేరుకోగానే గడాఫీ అనుకూల సైన్యం వాటిని చుట్టుముట్టింది. నౌకల్లోని ఇద్దరు సిబ్బంది తప్పించుకునేందుకు ప్రయత్నించగా సైన్యం వారిని అదుపులోకి తీసుకుంది. లిబియా సైన్యానికి బందీలుగా చిక్కిన వారు త్వరలోనే స్వదేశానికి చేరుకుంటారని డచ్‌ ప్రధాని మార్క్‌ రుట్టే తెలిపారు.