3, మార్చి 2011, గురువారం

తెలంగాణా పై ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిందే..

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిం దేనని, ఈ డిమాండ్‌తో లోక్‌సభ సమావేశాల ను అడ్డుకుంటామని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. బుధవారం తెలం గాణా భవన్‌లో జరిగిన తెరాస రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మార్చి 10న జెఎసి పిలుపు మేరకు నిర్వహించతలపెట్టిన హైదరాబాద్‌ దిగ్బంధన కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చి నట్టు తెలిసింది.
తెలంగాణా ప్రజలు శాంతియుతంగా తీవ్రమైన స్థాయిలో ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని, ఇక ఉద్యమాలను ఉధృతం చేయడం ద్వారానే తెలంగాణాను సాధించు కోవాలని ఆ దిశలో పార్టీ శ్రేణులు ఉద్యమాలకు సమాయత్తం కావాలని కూడా ఆయన సూచించి నట్టు తెలిసింది. జాతీయస్థాయిలో 90 శాతానికి పైగా పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా లేఖలను యుపిఎ ప్రభుత్వానికి ఇచ్చినా ఇంకా ఏకాభిప్రాయమంటూ తాత్సారం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణా ఒక్క రాత్రికిరాత్రే పరిష్కారమయ్యే సమస్య కాదని చెప్పడంపై కెసిఆర్‌ మండిపడ్డట్టు తెలిసింది.
2009 డిసెంబర్‌ 9న ఆయనే తెలంగాణా ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి అనంతరం శ్రీకృష్ణ కమిటీని నియమించి నివేదికను తెప్పించుకున్న తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడడంలో అర్థమేమిట ని ఆయన నిలదీశారు. ఢిల్లిdలో సీమాంధ్రుల లాబీయింగ్‌ ఉధృతంగా కొనసాగుతుందని, ఈ పరిస్థితుల్లో తెలంగాణాకు అనుకూలంగా పార్టీల మద్దతును కూడగట్టేందుకు ఢిల్లిdలో ఉండాల్సిన అవసరం ఉన్నం దున 10న జరిగే హైదరాబాద్‌ దిగ్బంధన కార్యక్రమాన్ని పార్టీ నాయకులు విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించినట్టు తెలిసింది. ఆయన మార్చి 10న హైదరాబాద్‌ దిగ్బంధనానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.