రంగస్థల నటుడుగా, ప్రజానాట్యమండలి కళాకారుడుగా సినీ నటుడుగా, రచయితగా మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. కృష్ణానది వరదల్లో కృష్ణాష్టమినాడు గుంటూరు తాలూకా కృష్ణాయపాలెంలో 1916లో జన్మించినపుడు పశునష్టం, పంటనష్టం తమ కుటుంబంలో కూడా ఏర్పడితే గొంతులో వడ్లగింజ వేసి చంపేయాలని నిర్ణయించిన సమీప బంధువులు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వల్లా రాధాకృష్ణమూర్తి పేరుతో క్రమక్రమంగా కృష్ణాజిల్లా కోలవెన్నులో ఎదుగుతూ, పునాదిపాడు హైస్కూల్లో చదివారు. చిన్న తనంలోనే జంగం కథలు, వీధి భాగవతాలు, పగటివేషాలు, తోలు బొమ్మలాటలు, చెక్క భజనలు, హరికథలు చూస్తూ, వింటూ జానపద కళల మీద అభిరుచి ఏర్పరుచుకున్నారు. చిత్ర లేఖనం కూడా నేర్చుకున్నారు బందరు జాతీయ కళాశాలలో కొంతకాలం.
తండ్రి మరణంతో చదువు అర్థంతరంగా ఆగిపోతే పుస్తకాల ద్వారా చదువు కోవచ్చని గ్రంథాలయ ఉద్యోగిగా నెలకు రెండు రూపాయల జీతంతో చేరారు. కాంగ్రెస్ అభిమానిగా వుంటూ పునాదిపాడు వచ్చిన గాంధీని చూసి ఉత్తేజం పొందారు. తరువాత కమ్యూనిజం వేపు మళ్ళారు. పశువైద్యం అభ్యసించి 'పశువైద్యాచార్య' డిగ్రీ పొంది పశువైద్యం కొంతకాలం చేసారు.
విజయవాడ చెట్ల బజారులో 'చౌదరి విలాస్' అనే హోటల్ టేబుల్ మీల్స్‌తో పెట్టి భోజనం చేసాక విశ్రాంతి తీసుకునేందుకు మడతమంచాలు ఇచ్చే విధానం అదనంగా ప్రారంభించారు.
ఫొటోగ్రాఫీ కూడా నేర్చుకున్నారు. తన గ్రామానికి చెందిన సీతారత్నంని ప్రేమించి 1937లో పెళ్ళి చేసుకోవడమే కాకుండా, ఆడవాళ్ళు నటించడంపై శంకలున్న ఆ రోజుల్లో ఆమెతో 'మా భూమి' నాటకంలో తనతో పాటు హీరోయిన్‌గా నటింపజేసారు. ఈ నాటకాన్ని బొంబాయి, పూనా, షోలాపూర్, అహమ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో పలుమార్లు ప్రదర్శించారు.
ఉప్పు సత్యాగ్రంహంలో 16వ ఏటనే పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అయిదునెలలు జైలు శిక్షనూ అనుభవించారు.
విజయవాడలో 'ఆంధ్రా ఆర్ట్ క్రియేటర్' నాటక సంస్థ ఏర్పాటులో ఆత్రేయ, నాగభూషణం, రమణారెడ్డి, వి. మధుసూదనరావుతో కలిసారు. పలు నాటకాలు ప్రదర్శించారు. స్వాతంత్య్రం వచ్చాక, ప్రజానాట్య మండలి కళాకారులకి ఇబ్బందులు ఎక్కువైతే, చాలమందిలాగే మిక్కిలినేని కూడా కె.ఎస్.ప్రకాశరావు ప్రోత్సాహంతో మద్రాసు చేరి 'దీక్ష' చిత్రంలో నటించారు. అలా 1951లో 'దీక్ష' చిత్రం విడుదల కావటంతో సినిమా నటుడయ్యారు. ఫలానా వేషమే అని పట్టు బట్టకుండా వచ్చిన ప్రతి వేషమూ వేయడం వల్ల ఎక్కువగా తక్కువ నిడివిగల పాత్రలే లభించాయి. మొత్తం నాలుగొందల చిత్రాల్లో నటిస్తే అందులో ఎన్టీఆర్‌తో నటించిన చిత్రాలు 150.
నటుడు పెరుమాళ్ళు ఇంటికి వెళ్లాక వచ్చి ఆలోచనతో తొలిసారి 'ఆంధ్ర నాటక రంగ చరిత్ర'ని రాసి బహుమతి తెచ్చుకున్నారు. అక్కినేని ఆర్థిక సహాయం ప్రోత్సాహంతో అది గ్రంథ రూపంగా వెలువడటంతో అక్కినేని దానికి కృతిభర్తను చేసారు. దీనికిముందు నార్ల వెంకటేశ్వరరావు సూచనతో నటనమీద పలువ్యాసాలు, కందుకూరి వీరేశలింగం మీద కొన్ని వ్యాసాలు రాసారు. తరువాత 'నటరత్నాలు' అని రంగస్థల నటీ నటులమీద రాసి ఎన్టీఆర్‌కి అంకితమిచ్చారు. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 'నటరత్నాలు' ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‌గా 25 సంవత్సరాల పాటు ప్రచురణ కావడం తనకెంతో ఆనందం కలిగించేదని, ఆంధ్రప్రభ చదివి పలువురు కళాకారులకు అనేకమంది ఆర్థిక సహాయం చేయడం వల్ల సంతృప్తి కల్గిందని మిక్కిలినేని చెప్పేవారు. ఆ తరువాత 'తెలుగువారి జానపద కళారూపాలు' అనే గ్రంధాన్ని రచించి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బహుమతి పొందారు.
మాయాబజార్‌లో కర్ణుడుగా, జగదేకవీరుని కథ, గులేబకావళికథలో ఇంద్రుడుగా, సీతారామకళ్యాణం సంపూర్ణరామాయణం, సీతాకళ్యాణం చిత్రాల్లో జనకుడుగా, దక్షయజ్ఞంలో బ్రహ్మగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో బలరాముడుగా నర్తనశాల, బబృవాహన, శ్రీకృష్ణావతారం చిత్రాల్లో ధర్మరాజుగా, పాండవ వనవాసంలో దుశ్శాసనుడుగా, 'బాలభారతం, దానవీరశూరకర్ణ' చిత్రాల్లో ధృతరాష్ట్రుడుగా 'శ్రీకృష్ణ పాండవీయం, శ్రీమద్విరాట్‌పర్వం'లో భీష్ముడుగా పౌరాణిక చిత్రాల్లో నటించారు.
పల్లెటూరు, పరివర్తన, పుట్టిల్లు,కన్నతల్లి, సంతానం, అప్పుచేసి పప్పుకూడు, కులగోత్రాలు, గుండమ్మకథ, లక్షాధికారి, రాముడు భీముడు, అంతస్థులు, ఆలీబాబా 40 దొంగలు, పవిత్ర హృదయాలు, లక్ష్మీ కటాక్షం, మంచిమనిషి, సిఐడి, బాలరాజు కథ, రాం రాబర్ట్ రహీం, పులి బెబ్బులి, వంటి సాంఘిక చిత్రాల్లో తెనాలి రామకృష్ణ, సారంగధర, మహామంత్రి తిమ్మరుసు, పల్నాటియుద్ధం మున్నగు చారిత్రక చిత్రాల్లో మిక్కిలినేని నటించారు. 1997లో విడుదలైన 'శ్రీకృష్ణార్జున విజయం' చివరి చిత్రం. అప్పటినుంచి విజయవాడలో కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళతో గడుపుతున్నారు.
ఎం.ఎస్.రెడ్డి, సినారె, వేణుమాధవ్‌లతో మంచి స్నేహం ఉంది. జగ్గయ్య, గుమ్మడి, ఆరుద్ర, శ్రీశ్రీ, ఆత్రేయ, ప్రభృతుల స్నేహం ప్రోత్సాహం వల్ల తను రచనల మీద కూడా దృష్టి పెట్టినట్టు చెబుతారు. విజయవాడలో ఫిబ్రవరి 22న అంతిమ శ్వాస వదిలారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.