3, మార్చి 2011, గురువారం

ఆర్టిస్టులతో క్యూ కట్టించిన పితాంబరం

ప్రముఖ రూపశిల్పి, చిత్ర నిర్మాత పితాంబరం (90) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చెన్నయ్‌లో ఫిబ్రవరి 21న మృతి చెందారు. ఎన్‌.టి.రామారావుకు పెర్సనల్‌ మేకప్‌మెన్‌గా 40 సంవత్సరాలు పనిచేసారు. ఎన్టీఆర్‌ నటించిన మాయాబజార్‌ నుంచి పలు పౌరాణిక చిత్రాల్లో, చారిత్రాత్మక, సాంఘిక, జానపద చిత్రాల్లో పీతాంబరం చేసిన మేకప్‌ ఆ చిత్ర విజయాలకు, ఆయా పాత్రలకు పేరు ప్రతిష్ఠలు రావడానికి చాలా దోహదం చేసాయి. ఎం.జి.ఆర్‌కి కూడా 30 సంవత్సరాలపాటు మేకప్‌ చేసారు. ఎస్వీ రంగారావు, సావిత్రి, నాగభూషణం ఇలా పలువురికి పీతాంబరం చేసిన మేకప్‌ వల్ల పేరొచ్చింది. వెయ్యి సినిమాలకు మేకప్‌ మేన్‌గా వ్యవహరించారు. ఆ రోజుల్లో ఎవరికివారు ఎన్టీఆర్‌ నుంచి అనేకమంది ముందు మేకప్‌ వేయించుకోవాలని వాహినీ స్టూడియో మేకప్‌రూమ్‌ ముందు అర్థరాత్రి దాటాక పడుకునో, కూర్చునో నిరీక్షించేవారు.

బాలకృష్ణ తొలిసారి మేకప్‌ వేయించుకున్నది పీతాంబరం వద్దనే. పీతాంబరంకు భార్య ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. దర్శకుడు పి. వాసు ఈయన కుమారుడే. మరో కుమారుడు విద్యాసాగర్‌ చిత్ర పంపిణీదారునిగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌.టి.ఆర్‌ నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రాన్ని ఎస్‌.డి.లాల్‌ దర్శకత్వంలో 1975లో నిర్మించారు. పి.సి.రెడ్డి దర్శకత్వంలో చంద్రమోహన్‌, లత నటించిన 'పంచభూతాలు'చిత్రాన్ని 1979లో నిర్మించారు.