3, మార్చి 2011, గురువారం

ఐర్లాండ్‌ సంచలనం.. ఇంగ్లాండ్ కి షాక్

బెంగళూరు: ఉపఖండం ప్రపంచకప్‌లో తొలి సంచలనం నమోదైంది. గురువారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఐర్లాండ్‌ మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. కెవిన్‌ ఓబ్రియాన్‌ విధ్వంసకర సెంచరీ సాధించడంతో 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్‌ మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదించింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన కెవిన్‌ 63 బంతుల్లోనే 13 ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో 113 పరుగులు సాధించి ఐర్లాండ్‌కు అద్భుత విజయం అందించాడు. ఒక దశలో 111 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న ఐర్లాండ్‌ను కెవిన్‌ ఆదుకున్నాడు. కుసక్‌ అండతో ఇంగ్లండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇద్దరూ కలిసి సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. చెలరేగి ఆడిన కెవిన్‌ 50 బంతుల్లోనే 13 ఫోర్లు, 6సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు. ఇదే క్రమంలో కుసక్‌తో కలిసి 94 బంతుల్లోనే ఆరో వికెట్‌కు 150 పరుగులు జోడించాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కుసక్‌ (47) పరుగులు చేశాడు. చివర్లో మూనీ అజేయంగా 33 పరుగులు చేసి జట్టును విజయపథంలో డిపించాడు. సెంచరీ హీరో కెవిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
శుభారంభం...
అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు స్ట్రాస్‌, పీటర్సన్‌ శుభారంభం అందించారు. ఇద్దరూ ఐర్లాండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే పరుగుల వేగం తగ్గకుండా చూశారు. స్ట్రాస్‌ సింగిల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వగా, పీటర్సన్‌ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ స్కోరు 7.5 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. వీరిని ఔట్‌ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే 37 బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేసిన స్ట్రాస్‌ను డాక్‌రెల్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 91 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు చెలరేగి ఆడిన పీటర్సన్‌ 50 బంతుల్లో 7ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి స్టిర్లింగ్‌ బౌలింగ్‌లో బౌలింగ్‌ లో పెవిలియన్‌ చేరాడు. దీంతో ఇంగ్లండ్‌ 111 పరుగుల వద్దే రెండో వికెట్‌కు కోల్పోయింది.
రాణించిన ట్రాట్‌, బెల్‌..
ఈ దశలో క్రీజులోకి వచ్చిన జోనాథన్‌ ట్రాట్‌, ఇయాన్‌ బెల్‌ ఇన్నింగ్స్‌ కుదుట పరిచే బాధ్యత తమపై వేసుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగుల వర్షం కురిపించారు. ఇద్దరూ పోటీ పడి షాట్లు కొట్టడంతో స్కోరు బోర్డు పరిగెత్తింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ స్కోరు 25.3 ఓవర్లలోనే 150 పరుగులు దాటింది. మరోవైపు వేగంగా ఆడిన ట్రాట్‌ 55 బంతుల్లో 5ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే ఇయాన్‌ బెల్‌ కూడా 61 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ మార్క్‌కు చేరుకున్నాడు. అంతేగాక ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వా మ్యాన్ని కూడా నమోదు చేశారు. అయితే 86 బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్స్‌తో 81 పరుగులు చేసిన బెల్‌ను మూనీ ఔట్‌ చేశాడు. దీంతో 167 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే ట్రాట్‌ (92) కూడా పెవిలియన్‌ చేరాడు. ఈ వికెట్‌ కూడా మూనీ ఖాతాలోకే వెళ్లింది. చివర్లో ఐర్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టడంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 327 పరుగులకే పరిమితమైంది. ఐర్లాండ్‌ జట్టులో మూనీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: ఆండ్రూ స్ట్రాస్‌ (బి) డాక్‌రెల్‌ 34, పీటర్సన్‌ (సి) నియాల్‌ ఓబ్రియాన్‌ (బి) స్టిర్లింగ్‌ 59, ట్రాట్‌ (బి) మూనీ 92, ఇయాన్‌ బెల్‌ (సి) స్టిర్లింగ్‌ (బి) మూనీ 81, కాలింగ్‌వుడ్‌ (సి) కెవిన్‌ ఓబ్రియాన్‌ (బి) మూనీ 16, ప్రియర్‌ (బి) జాన్‌స్టన్‌ 6, బ్రెస్నన్‌ (సి) జాన్‌స్టన్‌ (బి) మూనీ 4, మైఖేల్‌ యార్డీ (బి) జాన్‌స్టన్‌ 3, స్వాన్‌ (నాటౌట్‌) 9. ఎక్స్‌ట్రాలు 23, మొత్తం 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 327 పరుగులు.
బౌలింగ్‌: రాన్‌కిన్‌ 7-0-51-0, జాన్‌ స్టన్‌ 10-0-58-2, అలెక్‌ కుసక్‌ 4-0-39-0, డాక్‌రెల్‌ 10-0-68-1, మూనీ 9-0-63-4, స్టిర్లింగ్‌ 10-0-45-1.
ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: పోటర్‌ఫీల్డ్‌ (బి) అండర్సన్‌ 0, స్టిర్లింగ్‌ (సి) పీటర్సన్‌ (బి) బ్రెస్నన్‌ 32, జోయ్స్‌ (స్టంప్డ్‌) ప్రియర్‌ (బి) స్వాన్‌ 32, నియాల్‌ ఓబ్రియాన్‌ (బి) స్వాన్‌ 29, విల్సన్‌ ఎల్బీ-స్వాన్‌ 3, కెవిన్‌ ఓబ్రియాన్‌ (రనౌట్‌) 113, కుసక్‌ (రనౌట్‌) 47, జాన్‌ మూనీ (నాటౌట్‌) 33, జాన్‌స్టన్‌ (నాటౌట్‌) 7. ఎక్స్‌ట్రాలు 33, మొత్తం 49.1 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 329 పరుగులు.
బౌలింగ్‌: అండర్సన్‌ 8.1-1-49-1, బ్రాడ్‌ 9-0-73-0, బ్రెస్నన్‌ 10-0-64-1, యార్డీ 7-0-49-0, స్వాన్‌ 10-0-47-3, కాలింగ్‌వుడ్‌ 5-0-26-0.