రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసిన శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం మాత్రం రహస్యంగా ఉంచింది. ఈ రహస్య నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొన్ని అంశాలు వెల్లడయ్యాయి. దీంతో ఈ 8వ అధ్యాయం కలకలం రేపుతోంది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఈ విధంగా పరిధులు దాటి నివేదికలో కొన్ని అంశాలను పొందుపర్చిందంటూ తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయగా, సమైక్యవాదులు శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉందంటూ పలువురు నాయకులు స్వాగతిస్తున్నారు.
రహస్యంగా ప్రభుత్వానికి అందజేసిన శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం రాష్ట్ర హైకోర్టు తీర్పు వల్ల కొంతమేర బయటపడింది. ఈ బయటపడిన అంశాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జరిగే పరిణామాలు, ఇబ్బందులకు గురిచేస్తాయని నక్సలిజం వ్యాప్తి చెందడంతో పాటు, మత ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంటుందని నివేదికలో శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా కమిటీ కొన్ని సలహాలు సూచించింది. ఈ విషయాలన్నీ తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల సభ్యులే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి మరొక అడుగు ముందుకేసి తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది.