పాన్ కార్డు లేకుంటే ఇంతవరకు కొన్ని వ్యవహారాలు అందుబాటులోకి రాకుండా వున్నాయి. ఇక ముందు పాన్ కార్డు లేని వారిపై అధిక పన్నుల మోత కూడా వుంటుంది. పాన్ కార్డు లేని వారితో పాటు, తప్పుడు పాన్ నంబరు ఇచ్చే వారి వద్ద నుంచి పన్ను మినహాయింపు (టీడీఎస్)ను అధికంగా రాబట్టదలచినట్లు కేంద్రం కొత్త బడ్జెట్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిబంధన వర్తించే విధంగా ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇప్పటికే పలు రకాల వ్యవహారాలకు పాన్‌ను తప్పనిసరి చేశారు. ఆదాయపు పన్ను పరిథిలోకి రాని వారు వీటిని పొందక తప్పటం లేదు. పెట్టుబడి మార్కెట్‌లోని అన్ని రకాల లావాదేవీలకు పాన్ తప్పనిసరిగా వుండాలని ఇంతకు ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు పాన్ లేకపోతే ఇక ఆయా వ్యక్తులపై భారాన్ని పెంచే చర్యలు చేపడతామని కేంద్రం కొత్త బడ్జెట్‌లో స్పష్టం చేసింది.
జీవితకాలం పాటు అమలులో వుండే పాన్ కార్డు ద్వారా వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. అందుకే ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలకు దీన్ని విస్తరించుకొంటూ వెళుతోంది. రాష్ట్రంలో పాన్ కార్డు దరఖాస్తులను స్వీకరించేందుకు యుటీఐ, ఇతర సంస్థలతో ఆదాయపు పన్ను శాఖ పొత్తు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి వరకు 45 లక్షల మందికి పాన్ కార్డులున్నట్లు తెలుస్తోంది.
ఒకరు ఒక పాన్ కార్డును మాత్రమే కలిగి వుండాలి. రెండో కార్డు వుంటే రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. అయితే రాష్ట్రంలో దాదాపు 55,000 మంది వద్ద రెండు పాన్‌కార్డులు వున్నట్లు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ గుర్తించి చాలా వాటిని రద్దు చేసింది. ఒకసారి కేటాయించిన పాన్‌లో ఇక మార్పులు చేయరు. కేవలం చిరునామాలో మార్పులను మాత్రమే నమోదు చేస్తారు. పాన్‌ను ఇవ్వటానికి గతంలో బాగా ఆలస్యం జరిగేది. ఇప్పుడు 15రోజుల వ్యవధిలోనే వస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కూడా పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందజేశాక దాని పరిస్థితి ఏమిటనేది ఐటీ శాఖ వెబ్‌సైట్ సాయంతో తెలుసుకోవచ్చు.
తప్పనిసరి వేటికి?
ఏదైనా సంస్థ జీతాలు చెల్లించేటప్పుడు టీడీఎస్‌ను వసూలు చేసే వ్యక్తులకు సంబంధించిన పాన్ కార్డు నెంబరు తప్పనిసరి. ఐటీ రిటర్న్ దాఖలుకు, ఆ శాఖ అధికారితో జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలకు, అక్కడ చెల్లించే చలానాలకు పాన్ అవసరం వుంది.
వ్యాపారి వార్షిక టర్నోవర్ రూ. 5 లక్షలు దాటినప్పుడు, ఐటీ చట్టాలకింద పన్నులు, సుంకాలు చెల్లించే వారికి పాన్ అవసరం. కొనుగోలుదారుడైన వ్యాపారి నుంచి పన్నును వసూలు చేసేటప్పుడు అతని పాన్‌ను అమ్మకందారు పేర్కొనాలి. ఎగుమతిదారులు, దిగుమతిదారులు, పన్ను కట్టలేకపోయినా పాన్ వుండితీరాలి.
స్థిరాస్తి విలువ రూ.5లక్షలు దాటినప్పుడు వాటి కొనుగోలు, అమ్మకాలు, మోటారు వాహనాలు కొనుగోలు, హోటళ్లలో నగదు రూపేణా రూ. 25,000కు మించి చెల్లింపు, సెల్‌ఫోన్ సహా టెలీఫొన్ కనెక్షన్ పొందటానికి పాన్ అవసరం. బ్యాంకు, పోస్టాఫీసులో రూ.50,000కు మించిన డిపాజిట్లకు, ఫండ్లు సంబంధిత వ్యవహారాలకు, డీమ్యాట్ ఖాతా ప్రారంభించడానికి పాన్ కార్డు తప్పనిసరి.
పాన్ కార్డు వివరాల అప్‌డేట్ సులభమే
ఆదాయపు పన్ను శాఖ అధికారులు అందించే పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ (పాన్-శాశ్వత ఖాతా సంఖ్య) ఎంతో ముఖ్యమైన ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా చిరునామా మారిన పక్షంలో పాన్‌కార్డు వివరాల్లోని సమాచారం ఎంతో ఉపకరిస్తుంది. ఒకసారి పాన్‌కార్డు తీసుకునేటప్పుడు చూపే శ్రద్ధ తదుపరి వివరాలు అప్‌డేట్ చేయడంలో మనవారు ఎంతో వెనుకబడి వున్నారు. చాలా సులభమైన పద్ధతుల్లో ఇల్లు కదలకుండానే తాజా సమాచారాన్ని చేర్చే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డిఎల్) ఆధ్వర్యంలో సేవలందిస్తున్న టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ (టిన్) అప్‌డేట్ సేవలందిస్తుంది. తాజా ఫొటోను చేర్చడం, చిరునామా, సంతకం మార్పు తదితర వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. పాన్ కార్డు మార్చుకుంటూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు
ఎన్‌ఎస్‌డిఎల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు పొంది పేరు, చిరునామా, తాజా ఫొటోగ్రాఫ్‌లను జత చేర్చి ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్ చేయడం ద్వారా 15 అంకెల యునీక్ నెంబర్ జనరేట్ అవుతుంది.
డిస్పాచ్ ద్వారా అయితే ఏఏ సమాచార మార్పు కోరుకుంటున్నారో ఆయా వివరాలను డాక్యుమెంట్లు సహా ఎన్‌ఎస్‌డిఎల్, థర్డ్ ఫ్లోర్, సఫైర్ చాంబర్స్, నియర్ బానెర్, పూనె - 411045, చిరునామాకు అకనాలెడ్జ్ సహా పంపాలి.
చెల్లింపుల పద్ధతి: మార్పులు కోరుకునే భారతీయులు 94 రూపాయలను, ఎన్‌ఆర్‌ఐలు 744 రూపాయలను ఆన్‌లైన్ ద్వారా లేదా ముంబాయిలో చెల్లుబాటయ్యే విధంగా డిడి, చెక్‌లనైనా పంపవచ్చు.
డెలివరీ అండ్ ట్రాకింగ్: కొత్త పాన్ కార్డు డెలివరీ పోస్టు ద్వారా అవుతుంది. ఈ బట్వాడా ఏ దశలో ఉందన్న విషయాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
గుర్తుంచుకోవాల్సింది: ఆన్‌లైన్‌లో ముందుగా పాన్ కార్డుపై ఉన్న సమాచారాన్ని ఫీడ్ చేయాలి. ఆపై మార్పులు కోరుతున్న వివరాలు అందించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా ఆ సమాచారాన్ని సపోర్ట్ చేసే డాక్యుమెంట్లు ఎన్‌ఎస్‌డిఎల్ కార్యాలయానికి అందాలి.
పాన్ కార్డు పోయిన పక్షంలో కూడా ఇదే దరఖాస్తును వినియోగించి కొత్త కార్డు పొందవచ్చు.