తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేదిగా ఉన్న కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం ఉందని, కమిటీ సీమాంధ్రులకు అమ్ముడుపోవడమే కారణమని సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి , ఆరోపించారు. కమిటీ సభ్యులను ప్రాసిక్యూట్ చేసి తప్పుడు నివేదిక ఇచ్చినందుకు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కమిటీని నియమిస్తే తెలంగాణలో జరిగిన ఆత్మ బలిదానాలపై కనీసం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
లగడపాటి రాజగోపాల్ రహస్యంగా ఇచ్చిన నివేదిక, శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలోని నివేదిక ఒక్కటే. అయితే లగడపాటి ఎంత మొనగాడో అర్థమవుతోందన్నారు. ఈ నివేదిక రూపొందించడంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం సక్రమంగా గమనిస్తే వీరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుందని, వీలైతే వీరికి ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు.